ప్రజాశక్తి - చిలకలూరిపేట : పేరుకు ప్రభుత్వ ఉద్యోగి అని సమాజంలో గొప్పగా చెప్పుకుంటున్నా వచ్చేది మాత్రం అరకొర జీతం.. అది కూడా సమయానికి అందక కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సిన దుస్థితిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బతుకులీడుస్తున్నారు. వ్యర్థాలను తొలగించే వాహనాల (క్లాప్) డ్రైవర్లకు ఆరు నెలలుగా, మెప్మా ఆర్‌పీలకు నాలుగైదు నెలలుగా జీతాల్లేవు. మిగతా శాఖల్లో ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. దీంతో వీరు కుటుంబ పోషణతోపాటు ఇంటి అంద్దెలు, వైద్య ఖర్చులు, ఇతర ఖర్చులకూ అప్పులు చేస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ఒక గుమస్తా స్థాయి ఉద్యోగికి తన ఉన్నతాధికారుల వద్ద రూ.రెండు వేలు చొప్పున తీసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా తల్లిని ఆస్పత్రిలో చూపించడానికి అప్పు కోసం చేయి చాచాల్సిన దుస్థితి ఏర్పడింది.
మండల స్థాయిలో సుమారు 40 వరకూ ప్రభుత్వ శాఖల్లో మూడున్నర వేల మంది వరకూ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. వీరికి ప్రతినెలా వచ్చే జీతం రూ.9 వేల నుండి రూ.16 వేలలోపే. ఇవి కూడా కొన్ని శాకలకు నాలుగు నెలల నుండి మరికొన్ని శాఖల్లో ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వలేదు. అధికారి హోదా ఉద్యోగులకూ రెండు మూడు నెల్లుగా జీతాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే పెరిగిన ధరలతో జీతాలు చాలకపోతుంటే మరోవైపు కొద్దిపాటి జీతాలు కూడా నెలల తరబడి ఇవ్వకుంటే ఇల్లు ఎలా గడస్తుందని ఉద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు.
ఇదంతా ఒకెత్తయితే వీరు ఉద్యోగులనే కారణంతో వీరి కుటుంబాల్లోని ఇతరులకు వచ్చే పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల్లో కోత పెట్టారు. మరోవైపు కార్యాలయాల నిర్వహణ ఖర్చులనూ ప్రభుత్వం విడుదల చేయని కారణంగా వాటినీ ఉద్యోగులే భరించాల్సి వస్తోంది. ఇటీవల ఒక కార్యాలయం బాగా శిథిలావస్థకు చేరడం, ఎలుకలు గుంతలు పెట్టడంతో రూ.30 వేల సొంత డబ్బులతో మరమ్మతు చేయించుకోవాల్సి వచ్చింది. అద్దె భవనాల్లో ఉండే కార్యాలయాలకూ అద్దెలు విడుదల చేయని కారణంగా దాన్నీ ఉద్యోగులే భరిస్తున్నారు. ఎపిఎస్‌ఐడిసి భవనానికి నెలకు రూ.2 వేల అద్దెను అందులోని ఉద్యోగులు చెల్లిస్తున్నారు.
5వ తేదీలోపు జీతాలివ్వాలి
పి.వెంకటేశ్వర్లు, సిఐటియు మండల కార్యదర్శి.
జీతాలే ఆధారంగా జీవనం సాగించే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయడంతోపాటు 5వ తేదీలోపు జీతాలివ్వాలి. ఇప్పటికే ధరలు పెరిగి జీతాలు చాలకపోతుంటే వాటిని పెంచాల్సిన ప్రభుత్వం కనీసం సమయానికైనా ఇవ్వకపోతే ఉద్యోగుల కుటుంబాలు ఎలా గడుస్తాయో ప్రభుత్వం ఆలోచించాలి. పైగా ఆయా కుటుంబాల్లోని వృద్ధులు, వికలాంగులకు పింఛన్లూ ఆపేయడం సరికాదు.










