ప్రజాశక్తి - కొమరాడ : గిరిజన విద్యాభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివద్ధిలో పథంలో నడిపిస్తున్నామని పాలకులు, ఉన్నతాధికారులు ఆర్భాట ప్రచారాలు చేస్తున్నా ఆచరణలో ఎక్కడా అమలు కావడంలేదు. ఇందుకు నిదర్శనం పార్వతీపురం ఐటిడిఎ పరిధి గల ఆశ్రమ వసతి గృహాల నిర్వహణకు కనీసం బిల్లులు కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు రక్తహీనత లేకుండా సరైన పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నా బిల్లులు మాత్రం చెల్లించడంలేదు. దీంతో వసతి గృహాల నిర్వాహకులు, టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు అప్పు చేసి మరీ విద్యార్థుల ఆకలి తీర్చుతున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన సమయంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశాలు జారీ చేస్తారు.. అయితే ఆ దిశగా సరిపడా నిధులు మంజూరులో మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు గతేడాది నుంచి పూర్తిగా మెస్ బిల్లులు చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం పెట్టేందుకు వార్డెన్లు, టెండర్లు వేసి సరుకులు అందించే వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతేడాది 11 నెలల పెండింగ్ బిల్లులకు మొదట్లో మూడు నెలల బిల్లులు మాత్రమే చెల్లించారు. మిగిలిన 8నెలల బిల్లులు పెండింగ్లో ఉండడంతో వార్డెన్లతో పాటు సరుకులు అందించే కాంట్రాక్టర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. అలాగే మండలంలోని ఉలిపిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాల, పెదకేర్జీల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల, మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల వసతిగృహం, ఎండభద్ర, కెమిశీల వసతి గృహాల విద్యార్థులకు భోజనాలు పెట్టేందుకు వార్డెన్ నుంచి సరుకులు అందించే కాంట్రాక్టర్లు వరకు అప్పులు చేసి భోజనాలు పెడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత కురుపాం సబ్ ట్రెజరీగా ఉన్న కొమరాడ మండలాన్ని సాలూరు సబ్ ట్రెజరర్‌గా మార్చడంతో అప్పట్లో బిల్లులు నిలిచిపోయాయి. దీంతో గత ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తిగా బిల్లులు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. బిల్లుల చెల్లింపుకాకపోవడంతో అప్పటికే ఇబ్బందిపడిన వార్డెన్లు పిల్లలకు భోజనాలు పెట్టేందుకు దొరికిన చోట జీతాలతో సహా అప్పులు చేసి మరి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులు చెల్లించాలని పార్వతీపురం ఐటిడిఏ కార్యాలయం చుట్టూ వార్డెన్లు ప్రదర్శనలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అధికారులు మాత్రం బిల్లులు పెట్టాం, వస్తాయి ఏదో బాధపడి విద్యార్థులకు భోజనాలు పెట్టండి అంటూ సర్ది చెప్పి పంపిస్తున్నారు తప్ప బిల్లులు చెల్లింపునకు మాత్రం కనీసం చర్యలు చేపట్టడం లేదని పలువురు వార్డెన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది బిల్లుల్లో ఇంకా చెల్లింపులకు రాకపోతే ఈ కొత్త విద్యా సంవత్సరానికి ఇప్పటికే రెండు నెలలు పూర్తయి మూడోనెల భోజనాలు పెడుతున్నామని ఎక్కడ నుంచి అప్పులు చేసినా డబ్బులు సరిపడడం లేదని వసతి గృహాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వసతి గృహాలకు సరుకులు అందించే వ్యాపారులు కూడా ఇన్ని నెలలు బిల్లులు చెల్లించకపోతే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చి పాఠశాలలకు సరుకులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 8 నెలలతో పాటు ప్రస్తుతం రెండు నెలలు వసతి గృహాల మెస్ బిల్లులు బకాయిలు ఉన్నట్లు వసతి గృహాల వార్డెన్లు తెలిపారు. మొత్తం పది నెలలకు సుమారుగా మండలంలో ఉన్న ఐదు గిరిజన సంక్షేమ వసతి గృహాలకు సుమారు కోటి రూపాయలకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు కోట్ల మేరకు బడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో సిఎఫ్‌ఎంఎస్ అధికారులు బడ్జెట్‌కు ఆమోదం వేయకపోవడంతో నిధులు విడుదల కాకుండా ఉండిపోయింది. కానీ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లింపునకు పెద్దగా శ్రద్ధ వహించకపోవడంతో వసతి గృహాల నిర్వహణ బిల్లుల పరిస్థితి అద్వానంగా తయారయ్యిందని వార్డెన్లు వాపోతున్నారు. కొద్దిరోజులు పోతే విద్యార్థులకు కనీసం భోజనాలు పెట్టే పరిస్థితి కూడా కష్టతరంగా మారుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు మాట పక్కన పెడితే కనీసం భోజనం పెట్టేందుకు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఎంతో అవసరమైన మెస్ బిల్లులు చెల్లింపునకు చర్యలు చేపట్టాలని, వార్డెన్లు, కాంట్రాక్టర్లు ఆదుకోవాలని వసతి గహాల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.










