Oct 18,2023 21:02

అభివాదం చేస్తున్న వివిధ పార్టీల నాయకులు

కడప ప్రతినిధి : ఎగువ రాష్ట్రమైన కర్నాటకలోని అప్పర్‌భద్ర ప్రాజెక్టుతో కెసి కెనాల్‌, తుంగభద్ర హైలెవల్‌, లోలెవల్‌, చిత్రావతి ప్రాజెక్టులకు ముప్పు ఎదురు కానుందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ ఆడిటోరియంలో కృష్ణాజలాల పున:పంపిణీపై గెజిట్‌ నోటిఫికేషన్‌, రాష్ట్ర భవిష్యత్‌, సీమ ప్రాజెక్టులపై చర్చ పేరుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దక్షిణాధిలో బిజెపి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అడ్డదిడ్డంగా వ్యవహరిస్తోందన్నారు. ఎగువ రాష్ట్రమైన కర్నాటకలో అప్పర్‌భద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే గాకుండా రూ.ఆరు వేల కోట్లను కేటాయించడంపై సీమలో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పులివెందులలోని సాగునీటి ప్రాజెక్టులకు తీవ్రమైన ఎద్దడి ఎదురుకానుందని తెలిపారు. ఇది చాలదన్న ట్లుగా తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కృష్ణాజలాలను పున:పంపిణీ చేయాలనే పేరుతో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ను వేయడం దుర్మార్గమని తెలిపారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండగానే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. కృష్ణా జలాలను పున:పంపిణీ చేస్తే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్ట పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కృష్ణా జలాల పున:పంపిణీపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తే అఖిలపక్షాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను నిలదీశారు. కేంద్ర ఏజెంటుగా వ్యవహరించడం మానుకుని ప్రజల ప్రయోజనాలకు పాటుపడాలని హితవు పలికారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలైన వైసిపి, టిడిపి దొందూదొందూగా వ్యవహరిస్తు న్నాయని విమర్శించారు. రాయలసీమ వ్యాప్తంగా చర్చ నడిచేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తామన్నారు. కడప నడిబొడ్డున రాయలసీమ డిక్లరేషన్‌ పేరుతో ప్రగల్బాలు పలికిన దొంగల్లారా ఏమైంది మీ చిత్తశుద్ధి అని పరోక్షంగా బిజెపి నేతలనుద్దేశించి విమర్శ నాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతు నెత్తిన రూ.75 వేల అప్పు ఉండగా, రాష్ట్రంలో 2.45 లక్షలు అప్పు ఉందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, కౌలురైతుల ఆత్మహత్యలో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి రాహుకేతువులుగా మారాయన్నారు. నీటిపారుదల రంగానికి ఏడు విధాలుగా అన్యాయం చేస్తున్నాయని ఏకరువు పెట్టారు. జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలో గండికోట, సర్వరాయసాగర్‌, వామికొండ, పైడిపాలెం, గండికోట లిఫ్ట్‌, చిత్రావతి, తుంగభద్ర హైలెవల్‌, లోలెవల్‌ తదితర ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా జలాల పున:పంపిణీతో రాయలసీమ ఎడా రిగా మారుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రాజకీయా లకు అతీతంగా పోరాటం చేయాలన్నారు. రైతు నేత దశ రథరామిరెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లు అధికారంలో కొనసాగాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం తగదని హెచ్చరించారు. మీ రాజకీయ, వ్యక్తిగత ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్రాన్ని బలి చేయాల నుకోవడం అన్యాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయనే అంచనాతో దిగువ రాష్ట్రాల హక్కులను బలిపెట్టడం అనుచితమన్నారు. రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌పై తెలంగాణ కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టుకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్‌ పాలమూరు ప్రాజెక్టుపై కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టుకు వెళ్లకపోవడంలోని మతలబేమిటో తెలియడం లేదన్నారు. కృష్ణానదీ జలాల బోర్డును, ఎలక్ట్రిసిటీ బోర్డులను కర్నూలు నుంచి విశాఖ తరలించడం అర్థం లేని వ్యవహారమని తెలిపారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య రిజర్వాయర్‌ పునరుద్ధరణ సంగతి అటుంచితే మృతుల పరిహారానికి దిక్కులేకుండా పోయిందన్నారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు వనజ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్‌ ప్రసంగించారు. సదస్సుకు నగరంలోని పలువురు పుర ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.