అప్పర్ భద్రతో రాయలసీమ ఎడారే
- 24న కర్నూల్‌లో నిరసన దీక్షలు
- రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి
రాజశేఖరరెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల
అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాల సూరజ్ హోటల్‌లో రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల రాయలసీమ స్టీరింగ్ కమిటీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో సాగునీటి సమస్యను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారని అన్నారు. వలసలు, నిరుద్యోగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు రాయలసీమలో పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటు చేసి రైతుల గొంతులకు ఉరి వేస్తారా? అని ప్రశ్నించారు. బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కెసి కెనాల్ ఆయకట్టు పరిరక్షణ కోసం గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేయాలని, వేదవతి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 24న కర్నూల్ నగరంలోని ఎస్‌టిబిసి కళాశాల గ్రౌండ్‌లో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనదీక్ష చేపడుతున్నా మని, రాయలసీమ వాసులందరూ సహకరించాలని కోరారు. అనంతరం సంతకలసేకరణ చేపట్టి, చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అప్పర్ భద్ర ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, కేంద్ర అవార్డ్ గ్రహీత బండి నారాయణ స్వామి, నవీన్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, పోతుకూరి శ్రీకాంత్ నాయుడు, డాక్టర్ రామాంజనేయులు, అశోకవర్ధన్ రెడ్డి, ఉమ్మి సలీమ్, మాజీ కౌన్సిలర్ చింతల సుబ్బారాయుడు, కిరణ్ రాయల్, రామ్మోహన్ రెడ్డి, సీమకష్ణ, న్యాయవాది బాలస్వామి నంద్యాల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. వి. సుబ్బారెడ్డి,కుందూ పోరాటసమితి నాయకులు కామిని వేణుగోపాల్ రెడ్డి, ఎంఆర్‌పి ఎస్ (దండోరా) రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, బి సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగశేషు, జై భీమ్ జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి










