Jul 25,2023 22:31

సమావేశంలో మాట్లాడుతున్న గౌతు శిరీష

*తన కంపెనీ మందులు కొనాలని బెదిరింపులు
*టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపణ
ప్రజాశక్తి - పలాస :
రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష విమర్శించారు. విశాఖలో హార్క్‌ లైఫ్‌ సైన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ మందుల కంపెనీని ఏర్పాటు చేసి, ఆ కంపెనీ మందులనే కొనుగోలు చేయాలని ఉత్తరాంధ్ర పరిధిలోని వైద్యులు, మందుల దుకాణాల యజమానులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆ కంపెనీలో వాటా లేదని మంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. పలాసలో భూ కబ్జాలపై పత్రికలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నా, మంత్రికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు. భూ కబ్జాలపై జాయింట్‌ కలెక్టర్‌ సమక్షంలో దర్బార్‌ నిర్వహించారని, అందులో వచ్చిన ఫిర్యాదుల్లో ఒక్కటైనా పరిష్కరించగలిగారా అని ప్రశ్నించారు. శవ రాజకీయాలు చేయడంలో మంత్రి దిట్ట అని, ఇటీవల సూదికొండకు చెందిన మహిళ పలు కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే, ఆ వార్డు కౌన్సిలర్‌ భర్తపై కేసు పెట్టాలని మృతురాలి తండ్రిపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. మద్దతు ధర లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి మాకన్నపల్లి జీడి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంత్రికి కనిపించదా అని ప్రశ్నించారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, పట్టణాధ్యక్షులు నాగరాజు, టంకాల రవి శంకర్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.