ప్రజాశక్తి - ఆరిలోవ : ఆరిలోవ హెల్త్‌సిటీలోని అపోలో కేన్సర్ సెంటర్‌లో అత్యాధునిక బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ (బిఎంటి) యూనిట్‌ను ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునతో కలిసి బిఎంటి యూనిట్‌ను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖరీదైన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 వ్యాధులను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది రూ.3,400 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలకు రూ.8,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 750 సీట్లు అందుబాటులో వస్తున్నాయన్నారు.
అపోలో కేన్సర్ సెంటర్ మెడికల్ ఆంకాలజిస్టు డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ అత్యంత కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో రీజనల్ సిఇఒ సుబ్రహ్మణ్యం, వైజాగ్ అపోలో సిఇఒ రామచంద్ర, డాక్టర్ రవిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.










