Mar 14,2023 23:47

ప్రసస్థ రత్నంకు చర్మం ఊడిపోయి రక్తం కారుతున్న దృశ్యం

ప్రజాశక్తి-విఆర్‌.పురం
పదేళ్ల వయస్సు లోపే మెదడు సంబంధిత వ్యాధికి రెండు ఆపరేషన్లు. ఆపై ఫిట్స్‌ వచ్చింది. ఇలా ఉండగానే అరుదైన చర్మవ్యాధికి గురయ్యాడు. ప్రస్తుతం బోనకల్‌ మేఘశ్రీ ఆసుతపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసస్థ రత్నం అనే బాలుడికి వైద్యం అందించేందుకు తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి...
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్‌.పురం మండలం రేఖపల్లి గ్రామానికి చెందిన యు.కరుణాకర్‌ అటవీశాఖలో చిరు ఉద్యోగి. ఆయన కుమరుడు 12 ఏళ్ల ప్రసస్థ రత్నంకు చిన్నతనంలోనే మెదడు సంబంధిత వ్యాధి సోకింది. రెండు సార్లు ఆపరేషన్లు చేశారు. అప్పటి నుంచి ప్రతి రోజూ మందులు వాడుతున్నారు. పదేళ్ల లోపే రెండు సార్లు మెదడు సంబంధిత ఆపరేషన్లు జరగడంతో ఫిట్స్‌ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. తమిళనాడులోని రాయవెల్లూరు ఆసుపత్రిలో కూడా వైద్యం చేయించారు. ఫిట్స్‌తో ఇబ్బందులు పడుతుండగానే అరుదైన చర్మవ్యాధికి గురయ్యాడు. గడిచిన ఐదు నెలల నుంచి తీవ్రమైన జ్వరం, కామెర్లు, దగ్గు, నోటిపూత మొదలయ్యాయి. దురద రావడం, ఆ తర్వాత చర్మం ఊడిపోయి లోపల కండరాలు బయటకు కనిపించడం, నిరంతరం రక్తస్రావం కావడం జరుగుతుంది. ముఖం, ఛాతి, వీపు భాగంలో చర్మం పూర్తిగా ఊడిపోయి బాలుడికి ఏం జరిగుతుందో తెలియక ప్రసస్థ రత్నం తల్లితండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిరంతరాయంగా మందులు వాడుతుండడంతో ''స్టీఫెన్‌ జాన్సన్‌ సిండ్రోమ్‌'' అనే వ్యాధి సోకిందని చర్మ వైద్యులు చెబుతున్నారు. అది కూడా పూర్తిగా ధ్రువీకరించడం లేదు. బాలుడి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పలు ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రసస్థ రత్నానికి వైద్య సాయం అందించాలని ఆ కుటుంబం కోరుతోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి వైద్యం అందించడం చాలా ఖరీదుతో కూడుకున్నది. ఇప్పటికే ఆ కుటుంబం బాలుని వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అప్పుల పాలైంది. ప్రభుత్వం, దాతలు ముందుకొచ్చి తమ కుమారుడి వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆర్థిక సాయం అందించదల్చకున్న వారు 9440326777 నెంబర్‌కు ఫోన్‌పే (యు.కరుణాకర్‌), లేదంటే యు.ప్రసస్థ రత్నం, అకౌంట్‌ నెంబర్‌ 41745462362, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌0020680 బ్యాంకు అకౌంట్‌కు అందించవలసిందిగా కోరుతున్నారు.