ప్రజాశక్తి - భీమవరం రూరల్
మున్సిపాల్టీలో పనిచేస్తున్న ఆప్కోస్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపుమేరకు ఈ నెల 20, 21వ తేదీల్లో భీమవరం మున్సిపాల్టీ వద్ద చేపట్టనున్న నిరసన దీక్షలో కార్మికులు పాల్గొనాలని సిఐటియు పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు కోరారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ టి.సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి తాను అధికారంలోకి రాగానే మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. మున్సిపాల్టీలను శుభ్రంగా ఉంచడంలో కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. సరైన పనిముట్లు లేవని, సరైన సిబ్బంది లేరని పని భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాల్టీ స్కూల్ స్వీపర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవని, నెలకు రూ.4,000 జీవితంతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. స్కూల్ స్వీపర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్లాప్ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ సెక్షన్‌లో పనిచేసిన కార్మికులందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20, 21 తేదీల్లో భీమవరం మున్సిపాల్టీ వద్ద నిరసన దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. 27న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆగస్టు 7న కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని అప్పటికీ ప్రభుత్వ స్పందించకపోతే ఆగస్టు 15 తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నీలాపు రాజు బంగారు వరలక్ష్మి, ఆకుల సత్యనారాయణ, నేలాపు నాగేశ్వరరావు, ఎం.మునియ్య, విజయలక్ష్మి, దుర్గమ్మ, రాణి పాల్గొన్నారు.










