Oct 28,2023 21:42

ఆందోళనుద్దేశించి మాట్లాడుతున్న పెఐటియు నాయకులు వెంకటరమణ

ప్రజాశక్తి -పార్వతీపురంటౌన్‌ : ఆప్కాస్‌ ఉద్యోగులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రదర్శనలో భాగంగా జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాల్లోని మున్సిపల్‌ కార్మికులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ పర్మినెంట్‌ ఆప్కాస్‌ విధానం కార్మికులచే మున్సిపల్‌ ఆఫీసు నుండి నాలుగు రోడ్లు కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో తమ ప్రభుత్వం రాగానే ఆరు నెలల్లో పారిశుధ్య కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేస్తామని వాగ్దానం చేశారని, ఆ హామీ ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. కావున ఆప్కాస్‌ ఉద్యోగులందర్నీ పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్‌ వర్కర్స్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మిక సంఘ నాయకులు నాగవంశం శంకర్రావు, చీపురుపల్లి సింహాచలం, మామిడి శివ, నాగవంశం శివ, గంగరాజు, గంగయ్య, శివప్రసాద్‌, ఆనంద్‌, హరి, జలగడుగుల శాంతి, ఇప్పలమ్మ, పాపులమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు.
సాలూరు: మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా సహాద్యక్షులు టి.శంకరావు ఆధ్వర్యాన కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 11 వ పీఆర్సీ ప్రకారం కార్మికులకు రూ.20వేలు వేతనం ఇవ్వాల్సి వుండగా రూ.15వేలే చెల్లిస్తున్నారని చెప్పారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో మాదిరిగా కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ సహకార్యదర్శి టి.వెంకటరావు, నాయకులు పోలరాజు, మహిళా నాయకులు సీత పాల్గొన్నారు.
పాలకొండ : స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద విధులకు హాజరైన కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే భవిష్యత్తులో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కార్మికులంతా పాల్గొని జయప్రదం చేస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి సంతకాలతో కూడిన మెయిల్‌ కూడా పంపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల సంజీవి సురేష్‌, శ్రీదేవి, రఘు విమల, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.