Aug 24,2023 21:36

నిరసన తెలుపుతున్న మున్సిపల్‌ కార్మికులు

* కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు మున్సిపాల్టీల్లోని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ (ఆప్కాస్‌) కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌ అమలు చేయాలన్నారు. దుమ్ము, ధూళి, దుర్గంధం భరిస్తూ అనారోగ్యం బారిన పడుతూ పట్టణాలు, నగరాల పరిశుభ్రతకు పాటుపడుతున్న మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో, పాదయాత్రలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులపై సానుకూలంగా మాట్లాడి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారన్నారు. ఆరు నెలల్లో పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులను ఆప్కాస్‌లో చేర్చి శాశ్వత బానిసలను చేశారని చెప్పారు. దళారీ వ్యవస్థ ద్వారా క్లాప్‌ డ్రైవర్లను నియమించి కనీస వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వారికి రూ.18,500 కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు కళ్యాణ రాజు, ఎ.గురుస్వామి, ఆకుల శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.