- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
- క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 ఇవ్వాలి
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు
- మున్సిపల్ కార్మికుల నిరసనలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్, ఆమదాలవలస, పలాస: ఏళ్ల తరబడి మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ (ఆప్కాస్) కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యాన మున్సిపల్ కార్మికులు గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టగా, ఆమదాలవలసలో మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పలాసలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఫెడరేషన్ నగర అధ్యక్షులు ఎ.గణేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థతో పాటు మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కార్మికులను ఆప్కాస్ పరిధిలో చేర్చి వేతనాల్లో కోతలు విధించారని చెప్పారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు అనే పదాల్లో తేడా తప్ప చదువులు, పనులు ఒకటేనని చెప్పిన ముఖ్యమంత్రి మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయకపోవడం మోసపూరిత చర్య అని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను, శాశ్వత స్వభావం కలిగిన మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ 010 ద్వారా జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ , రిస్క్ అలవేన్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు రూ.18,500 వేతనం చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారానికి దశలవారీ ఆందోళనలు చేపడుతున్నట్లు చెప్పారు. 21న మున్సిపల్ కార్యాలయాల వద్ద మహిళా కార్మికుల సామూహిక రిలే నిరాహార దీక్షలు, 27న మున్సిపల్ కార్యాలయాల ముట్టడి, ఆగస్టు 7న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 15 తర్వాత నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఫెడరేషన్ నాయకులు కె.రాజు, ఎ.శంకర్, శేఖర్, డి.మాధవి, యాదమ్మ, భాగ్యం తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు టి.సంతోష్, కె.ధనలక్ష్మి, ఎన్.రమ, కె.రాజేశ్వరి, నీలమ్మ, ఎస్.రాధ తదితరులు పాల్గొన్నారు.










