ప్రజాశక్తి -గాజువాక : గాజువాక ఆటోనగర్ ఈ బ్లాక్‌లోని శ్రీవిష్ణు అపెరల్, ఫర్నిచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ఫర్నిచర్ షాప్ నుంచి గాజువాక హోల్ సేల్ షాపులకు పరుపులు, తలగడలు సరఫరా అవుతుంటాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలు
గాజువాక ఆటోనగర్ ఈ బ్లాక్‌లోని అపెరల్ పార్కులో నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి అపెరల్ పార్క్ దుస్తులను కుట్టే కంపెనీల కోసం ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో గాజువాక ఆటోనగర్ ఈ బ్లాక్‌లో వడ్లపూడి, ఫకీర్‌తకియా, యాదవజగ్గరాజుపేట ప్రజలు 70 ఎకరాల భూములను గజం రూ.250 చొప్పున అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి అందజేశారు. కాలక్రమేణా ఆ కంపెనీలు రాకపోగా ఫ్లెక్సీలు తయారుచేసే యూనిట్లు, వెల్డింగ్ సంబంధించిన పరిశ్రమలు ఏర్పడ్డాయి.
దీనిపై ఏపీఐఐసీ ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఈ విధమైన పరిశ్రమలు ఏర్పడుతున్నాయి. పరిశ్రమలు నడిపించ కుండా సంబంధిత యజమానులు కంపెనీలో స్థలాన్ని అద్దెకు ఇవ్వడం, అద్దెకు తీసుకున్న వ్యక్తులు వివిధ రకాల వస్తువులను కంపెనీలో భద్రపరచుకోవడం చేస్తున్నారు. దీంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.










