ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
విపత్తుల సమయాల్లో అండగా నిలిచేందుకు ఆపదమిత్రలు ఎంతగానో దోహదపడతారని జెడ్‌పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్ అన్నారు. స్ధానిక జెవిఆర్ నగర్‌లోని సోషల్ సర్వీస్ సెంటర్‌లో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఆపదమిత్ర వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ విపత్తు పీడిత జిల్లాల్లో కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయన్నారు. దీనిలో మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకూడా ఉందన్నారు. విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై 12 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. తొలివిడతగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలో ఎంపిక చేసిన 250 మందికి 12 రోజులు పాటు సమగ్ర శిక్షణ అందించారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 100 మందికి 12 రోజులుపాటు శిక్షణా కార్యక్రమం సాగుతుందన్నారు. విపత్తులు సంభవించిన సమయంలో తక్షణం స్పందించేలా ముఖ్యంగా తుఫాను, వరద ప్రభావిత మండలాలు, గ్రామాల్లో ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ఆపదమిత్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిటిఎం జి.ప్రసంగిరాజు, డిపిఎం రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.










