ప్రజాశక్తి -రంపచోడవరం
రాష్ట్రంలో విపత్తుల సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టే విధంగా ఆపద మిత్రలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఇఒపిఆర్ అండ్ ఆర్‌డి అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ మోహన్ తెలిపారు. రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్లో 11 మండలాలకు సంబంధించిన వందమంది ఆపద మిత్ర వాలంటీర్లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తుల సంభవించినప్పుడు 15 శాఖల ద్వారా సహాయక చర్యలు చేపట్టే విధంగా ఒక్కొక్క శాఖ నుండి ఒక్కొక్క రోజు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ఇచ్చే శిక్షణ పూర్తిగా అవగాహన చేసుకొని వివిధ రకాలైన విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. ఈ శిక్షణ ఎవరికైనా అర్థం కాకుంటే మళ్లీ చెప్పమని అడగవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌డిఓ కె.కోటేశ్వరరావు, డిఎల్‌పిఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో ఎంవిఆర్.కుమార్‌బాబు, ఇఒపిఆర్‌డి జాన్ విల్టన్, డిపిఎం శ్రీనివాసరావు, ఈపిఎం కిరణ్మయి, ఆపదమిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు.










