May 16,2021 12:15

కరోనా... కోవిడ్‌ 19. కంటికి కనపడని ఈ వైరస్‌ మానవాళిని అతలాకుతలం చేస్తోంది. కుటంబ సంబంధాలను కకావికలం చేస్తోంది. మానవతను మంట గలుపుతోంది. వైరస్‌ బారిన పడిన వారికి కనీస వైద్య సహాయం కష్టమవుతోంది. నా అనుకున్న వారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో గుండెలు పగిలేలా ఏడవడం నిత్య కృత్యమైంది. కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో బాధిత ప్రజానీకం దిక్కుతోచని స్థితికి చేరింది. కదిలిస్తే ఒకొక్కరు ఒక్కో కన్నీటి సముద్రమే.. కన్నవారిని, కనిన వారిని, జీవిత భాగస్వాములను, తోబుట్టువులను ఎలా కాపాడుకోవాలో తెలియక అంతా అయోమయం.. గందరగోళం !
   ఇంత వేదనలో... మేమున్నామంటూ కదిలాయి విజ్ఞాన కేంద్రాలు! అభ్యుదయ శక్తులు, ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాల సహకారంతో బాధిత ప్రజానీకానికి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. అన్ని వసతులూ ఉండి ప్రభుత్వాలు చేయలేని భుజాన వేసుకున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. చేస్తున్నాయి. గిరిజనుల కోసం ప్రత్యేకంగా అరకులో ఒక కేంద్రం పనిచేస్తోంది. వైద్యులను, నర్సింగ్‌ సిబ్బందిని సమీకరించి కష్టకాలంలో ఊపిరిపోస్తున్నాయి. అన్నీ తామై ఆదుకుంటున్నాయి.

isolation kendrallo yoga
                                              isolation kendrallo yoga

   మృత్యువును ధిక్కరించడం అంటే తెలుసా? ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చని, అది ఎక్కడికైనా దారి తీయవచ్చని తెలిసినా, ఖాతరు చేయకుండా ముందుకు పోవడం! అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తుల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా విజ్ఞాన కేంద్రాలు నిర్వహిస్తున్న ఐసోలేషన్‌ కేంద్రాల్లో అదే జరుగుతోంది. రోగులకు నేరుగా సేవలందించే వైద్యులు, నర్సింగ్‌ బృందాలతో పాటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతున్న సాధారణ కార్యకర్తలు కంటికి కనిపించని మహమ్మారితో అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఏ రోజుకారోజు అవసరమయ్యే భోజన పదార్థాలు సేకరించడం ఒక పనైతే, వాటిని వండి రోగుల వద్దకు చేర్చడం మరో పని! పారిశుధ్యం సజావుగా నిర్వహించడం మరో సవాల్‌! ఇవ్వన్నీ ఒక ఎతైత్తే కేంద్ర నిర్వహణ అంతకు మించిన పెద్ద పరీక్ష! వైద్య సిబ్బంది సూచనల మేరకు ఒక్కో రోగికి అవసరమైన మందులను సమీకరించాలి, సకాలంలో అందించాలి! ఈ పనిలో ఏ మాత్రం జాప్యం జరిగినా ఐసోలేషన్‌ కేంద్ర లక్ష్యమే దెబ్బ తింటుంది. వీటితో పాటు రోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ప్రతిక్షణం కాపాలా కాయడం, అత్యవరమైన పనులను అంతే వేగంగా చేయడమూ ఒక సవాలే... ఈ పనుల్లో ఎక్కడైనా, ఏక్షణమైనా వైరస్‌ కాటుకి గురయ్యే ప్రమాదం ఉందని వారికి తెలుసు! కానీ, సమాజం పట్ల బాధ్యత, ప్రజారోగ్యం పట్ల మక్కువ వారిని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రజారోగ్యం... కార్పొరేట్ల పరం కాకుండా, ప్రజల చేతుల్లోకి వెడితే ఎలా ఉంటుందో విజ్ఞాన కేంద్రాలు నిర్వహించే ఈ ఐసోలేషన్‌ సెంటర్లు తెలియచేస్తున్నాయి.

                                                            ఇలా మొదలైంది..!

ilaa modalaindi

   మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) ... విజయవాడలోనే కాదు. రాష్ట్రంలోనే పరిచయం అక్కరలేని పేరు! కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ కేంద్రం గత ఏడాదే ఐసోలేషన్‌ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. కరోనా వైరస్‌ గురించి అంతంతమాత్రపు అవగాహన మాత్రమే ఉన్న ఆ సమయంలో సమాజంలో నెలకొన్న భయాందోళనల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీస లక్షణాలు ఉన్న వారినుంచి కూడా కార్పొరేట్‌ ఆసుపత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తుండటంతో సామాన్యులకు అండగా ఉండటం కోసం ఒక ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంబివికె నిర్వాహకులు భావించారు. నిర్మాణం పూర్తయిన బాలోత్సవం భవన్‌ (అప్పటికి ప్రారంభం కూడా కాలేదు)ను దీనికి వేదికగా నిర్ణయించారు. భవనమైతే ఉందికానీ, వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది? అవసరమైన ఇతర పనులు చేసేవారు? ఇవన్నీ ప్రశ్నలే! ఈ దశలో విజయవాడ నగరంలోని అభ్యుదయ, ప్రజాతంత్రశక్తులు ముందుకు వచ్చాయి. చేయి కలపడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. వైద్య సేవలందించడానికి డాక్టర్‌ మాకినేని కిరణ్‌, డాక్టర్‌ గడ్డిపాటి బాబురావు, డాక్టర్‌ శివబాబు, డాక్టర్‌ అనురాధ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అత్యంత కీలకమైన నర్సింగ్‌ సిబ్బంది సమకూరారు. అలా ప్రారంభమైన ఆ ఐసోలేషన్‌ కేంద్రం గత ఏడాది పెద్దఎత్తున సేవలందించింది. వందలాది మందిని అరోగ్యవంతులను చేసి ఇళ్లకు పంపింది.
   వైరస్‌ ప్రభావం తగ్గుతోందన్న అంచనాలకు భిన్నంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒక్కసారిగా కేసులు పెరగడం ప్రారంభమైన విషయం తెలిసిందే. రోజుకు 9 వేలు, పది వేల కేసులు దాటుతుండటంతో ఐసోలేషన్‌ కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించాలని అనుకున్నారు. గత ఏడాది అనుభవంతో ఈ ఏడాది ఏర్పాట్లు చకచకా జరిగాయి. ఏప్రిల్‌ 16వ తేదిన బాలోత్సవ భవనంలో 18 మంది పేషెంట్లతో ఐసోలేషన్‌ కేంద్రం మళ్లీ ప్రారంభమైంది. మరుసటి రోజే మరో 16 మంది పేషెంట్లు వచ్చారు. వారినీ చేర్చుకున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి 50 బెడ్ల వరకు విస్తరించారు. కేసుల ఉధృతికి అవేం సరిపోతాయి? నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ''మేం వస్తాం.. మమ్మల్ని చేర్చుకోండి'' అంటూ వినతులు.. ఏం చేయాలి? ఎలా చేయాలి? మరోసారి మేథోమథనం !
   వనరులు పరిమితంగానే ఉన్నా ... వాటిని నూరుశాతం వినియోగించుకో వాలన్న తపన... ఈ సారి తాడేపల్లికి సమీపంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న సుందరయ్య స్కిల్‌ డెవలప్‌మెంటు సెంటర్‌ నాలుగు అంతస్తుల భవనాన్ని ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. చకచకా ఏర్పాట్లు జరిగాయి. ఏప్రిల్‌ 20వ తేదిన 80 పడకలతో ఈ కేంద్రం ఏర్పాటైంది. గత ఏడాది ఉన్న వైద్య బృందానికి మంగళగిరికి చెందిన డాక్టర్‌ సాయి ప్రసాద్‌, తెనాలి డాక్టర్‌ సాంబిరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ ఎఎస్‌ ప్రసాద్‌ తోడయ్యారు. మరికొందరు నర్సులూ చేరారు. ఇప్పుడు రోగులకు నిరాటంకంగా సేవలు అందుతున్నాయి. పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యే వారు అవుతుండగా, కొత్తగా అనారోగ్యానికి గురయి చేరుతున్న వారు ప్రతిరోజూ ఈ రెండు కేంద్రాల వద్ద కనిపిస్తారు. అవసరమైనన్ని రోజులు ఈ కేంద్రాలను కొనసాగించడంతో పాటు, పెరుగుతున్న ఒత్తిడికి తగ్గట్టుగా సేవల విస్తరణపైన నిర్వాహక బృందం ప్రస్తుతం దృష్టి సారించింది.

                                                     గుంటూరులో అదనపు పడకల ఏర్పాటు

 గుంటూరులో అదనపు పడకల ఏర్పాటు

   గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఏర్పాటైన ఐసోలేషన్‌ కేంద్రంలోని అన్ని పడకలు నిండిపోవడంతో అదనపు బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. యుటిఎఫ్‌, ప్రజారోగ్యవేదిక, డివైఎఫ్‌ఐ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం బ్రాడీపేట 2-7లో 25 పడకలతో ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి నిండిపోవడంతో మరో పది పడకలను అత్యవసరంగా ఏర్పాటు చేస్తున్నారు.

                                                సుందరయ్య స్ఫూర్తి కేంద్రానికి మహిళల చేయూత

సుందరయ్య స్ఫూర్తి కేంద్రానికి మహిళల చేయూత

    కర్నూలు నగరంలో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి స్థానిక మహిళలు చేయత అందిస్తున్నారు. మహిళా సంఘం నాయకులు కార్యకర్తలతో కలిసి రోగులకు భోజన ఏర్ప్రాట్లు చేయడానికి వీరు ముందుకు వస్తున్నార. ఈ ఐసోలేషన్‌ కేంద్రంలో పెద్ద సంఖ్యలో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికోసం స్థానిక ఇందిరా నగర్‌ మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ పని చేయడం తమకెంతో సంతృప్తి కలిగిస్తోందని వీరు చెబుతున్నారు.

                                                            రాష్ట్ర వ్యాప్తంగా ఇలా..

   విజయవాడ అనుభవం రాష్ట్రవ్యాప్తంగా ప్రేరణ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న విజ్ఞానకేంద్రాలు, ప్రగతిశీల అభ్యుదయ, ప్రజారంగాల శక్తులు ఈ విషయంపై దృష్టి సారించాయి. ఎక్కడికక్కడ ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సామాన్యులకు అండగా నిలవాలని నిర్ణయించాయి. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలే కానీ, అండగా నిలిచే వ్యక్తులకు, శక్తులకు రాష్ట్రంలో కొదవా? సేవా భావం ఉన్న డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది ఈ ఐసోలేషన్‌ కేంద్రాల్లో రోగులకు సేవలందించడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. అవసరమైన ఇతర సేవలు చేయడానికి, రోజువారీ పనులను నిర్వర్తించడానికి కార్యకర్తలు సై అన్నారు. వనరులు సర్దడానికి దాతలు సరేసరి! ఇవ్వన్నీ సమకూరినా.. అసలు సమస్య ఉండనే ఉంది. అదే, భవనాలు! 25 మందికో, 50 మందికో అన్ని వసతులు ఉన్న భవనాలు ఎలా? ఇది నిజంగా పెద్ద సవాలు! రాష్ట్ర ప్రభుత్వం వద్ద అవసరమైన అనేక వనరులు ఉన్నప్పటికీ ఈ దిశలో కార్యాచరణకు సిద్ధం కావడం లేదు. సరిగ్గా ఇక్కడే ప్రజారంగాల శక్తులు కీలక పాత్ర పోషించాయి. వివిధ జిల్లాలో ఉన్న తమ కార్యాలయాల భవనాలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చడానికి ముందుకు వచ్చాయి. కీలకమైన సమస్య పరిష్కారమైంది. తరువాతి పనులు చకచకా జరిగాయి. విజయవాడతో పాటు నెల్లూరు, అనంతపురం, కర్నూలు, పిడుగురాళ్ల, గుంటూరు. ఆకివీడు, అరకు, విశాఖపట్నం, భీమవరం, శ్రీకాకుళం, తిరుపతిలలో వివిధ విజ్ఞాన కేంద్రాల ఆధ్వర్యంలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటై రోగులకు సేవలందిస్తున్నాయి. ఈ సేవలను మరింత మెరుగుపరచడానికి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి ప్రస్తుతం కృషి జరుగుతోంది.

                                                      స్పందిస్తున్న విదేశాల్లోని వైద్యులు

   కరోనా బాధితుల కోసం విజ్ఞాన కేంద్రాలు చేస్తున్న కృషి విదేశాల్లోని తెలుగు వైద్యులనూ కదిలిస్తోంది. యు.కె., యుఎస్‌ఎలలోని డాక్టర్లు ఈ కృషికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా నాలుగు ఆక్సిజన్‌ కాన్‌సన్‌ట్రేటర్లను వారు ఎంబివికెకు అందించారు. వార్‌విక్‌షైర్‌లోని తెలుగు అసోసియేషన్‌ అందించిన ఈ సహకారానికిఎంబివికె మేనేజింగ్‌ ట్రస్టీ పి. మధు ధన్యవాదాలు తెలిపారు.

                                                               శ్రీకాకుళంలో యుటిఎఫ్‌ చొరవతో..

శ్రీకాకుళంలో యుటిఎఫ్‌ చొరవతో..

   శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయసంఘం యుటిఎఫ్‌ కార్యాలయంలోనే ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర నిర్వహణలో కూడా ఉపాధ్యాయులు చురగ్గా పాల్గొంటున్నారు. ఆందోళనకరంగా మారుతున్న రోగుల కోసం ఆక్సిజన్‌ను కూడా ఇక్కడ ఆందుబాటులో ఉంచారు. దీనికోసం ఉపాధ్యాయులు ప్రత్యేకంగా విరాళాలు సేకరించారు.

                                                   అనంతలో 'సింగమనేని' విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో

అనంతలో 'సింగమనేని' విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో

   అనంతపురం జిల్లాల్లో సింగమనేని విజ్ఞాన కేంద్రం ఆద్వర్యంలో సింగమనేని నారాయణ స్మారక ఐసోలేషన్‌ కేంద్రం పెద్ద సంఖ్యలో బాధిత ప్రజానీకానికి సేవలందిస్తోంది. దీనికి స్థానిక జనవిజ్ఞానవేదిక, యుటిఎఫ్‌లతో పాటు ఇతర అభ్యదయశక్తులు సహకారం అందిస్తున్నాయి. 25 పడకలతో ఏర్పాటైన ఈ ఐసోలేషన్‌ కేంద్రంనుండి ఇప్పటికే పలువరు ఆరోగ్యాన్ని బాగుచేసుకుని ఇళ్లకు వెళ్లారు. వైరస్‌ సోకిన తరువాత ఏం చేయాలో అర్ధం కాక, దిక్కుతోచని స్థితిలో ఇక్కడకు వచ్చానని, ప్రస్తుతం రోగ లక్షణాలు తగ్గుతున్నాయని చికిత్స పొందుతున్న రవి చెప్పారు. ఈ ఐసోలేషన్‌ కేంద్రం దిక్కులేని వారికి దిక్కుగా మారిందని లత అనే మహిళ చెప్పారు. ఇక్కడ పదిరోజులు చికిత్సపొంది డిశ్చార్జి అయిన స్పందన అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మాట్లాడుతూ కేవలం వైద్యంతో పాటు జీవితం పట్ల అవగాహన కల్పించారని చెప్పారు.

                                        పల్నాడులో పుతుంబాక వెంకటపతి స్మారక కేంద్రం

   పల్నాడు ప్రాంతంలో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రమే. కరోనా వ్యాప్తితో స్థానికుల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఈ నేపథ్యంలో పుతుంబాక వెంకటపతి స్మారక కేంద్రం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఐసోలోషన్‌ సెంటర్‌ స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. 30 పడకలతో ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా దాదాపుగా నిండిపోయంది. దీంతో మరింతగా విస్తరించడంపై నిర్వాహకులు దృష్టి సారించారు. స్థానిక ప్రజల నుండి కూడా ఈ కేంద్రానికి మంచి సహకారం లభిస్తోంది.

                                                           అడవి బిడ్డల కోసం అరకులో...

అడవి బిడ్డల కోసం అరకులో...

   చాపకింద నీరులా కరోనా గిరిజనులకు పెద్ద ఎత్తున వ్యాపిస్తోంది. సాధారణ వైద్య సౌకర్యాలే అంతంత మాత్రంగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో కరోనా కోసం ప్రత్యేక సేవలందడం అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం అరకులో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శారదా ట్రస్ట్‌, గిరిజన సంఘాలు ఈ కేంద్ర నిర్వహణకు సహకరిస్తున్నాయి. అరకులోని శారద నికేతన్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ ఐసోలేషన్‌ కేంద్రం కరోనా సోకిన గిరిజనులకు ప్రాధమిక వైద్యసౌకర్యాలు అందించడంతో పాటు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గిరిజనుల్లో అవగాహన పెంచడానికి ప్రాధాన్యత ఇస్తోంది. వైరస్‌ బారిన పడిన పలువురు గిరిజనులు ఇప్పటికే ఇక్కడ చేరి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు.
విశాఖలో...
   విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్లో ఉన్న ఎస్‌పిఆర్‌ భవన్‌ను కూడా ఐసోలేషన్‌ కేంద్రంగా మార్చారు. అల్లూరి సీతారామరాజు విజ్ణాన కేంద్రమే ఇక్కడ కూడా నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. 35 పడకలతో ఇక్కడ ఐసోలేషన్‌ కేంద్రం నడుస్తోంది.

                                                 నెల్లూరులో జెట్టి శేషారెడ్డి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో ...

నెల్లూరులో జెట్టి శేషారెడ్డి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో ...

   నెల్లూరు నగరంలో డాక్టర్‌ జెట్టి శేషారెడ్డి విజ్ఞానకేంద్రం, డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సంయుక్తంగా ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. 25 పడకలతో మే ఒకటిన ఈ కేంద్రం ప్రారంభమైంది. రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలకు చెందిన వైద్యులు ఇక్కడ వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. వివిధ ప్రజారంగాలకు చెందిన కార్యకర్తలు స్వఛ్చందంగా సేవలు అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి సేవలను మరింత విస్తృతం చేయడానికి నిర్వాహకులు కృషి చేస్తున్నారు.

రోజు ఇలా....

rojoo ilaa


ఐసోలేషన్‌ కేంద్రాల్లో రోజు ఇలా ఉంటుంది...
ఉదయం ఆరు గంటలు : ఆరోగ్యతనిఖీ
బి.పి,షుగర్‌, పల్స్‌ వంటివి పరిశీలిస్తారు
8 గంటలు : అల్పాహారం
11 గంటలు : రాగిజావ
మధ్యాహ్నాం12.30 : ఆరోగ్యతనిఖీ
1.00 గంట : భోజనం కోడిగుడ్డుతో
వారానికి రెండు రోజులు నాన్‌వెజ్‌
4 గంటలకు : స్నాక్స్‌ (పండ్లు, శనగలు వంటివి)
5.30 గంటలు : యోగా
రాత్రి 8 గంటలు : ఆరోగ్య తనిఖి
8.30 : భోజనం
10 గంటలు : నిద్ర
(స్థానిక పరిస్థితులను బట్టి మెనూలో మార్పు ఉండవచ్చు)
ఆందోళనలో ఉండే రోగికి కౌన్సిలింగ్‌ ఇస్తారు. ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేస్తారు.
ఐసోలేషన్‌ కేంద్రాలు ప్రాధమిక స్థాయివే కాబట్టి, రోగి పరిస్థితి తీవ్రంగా మారుతుంటే ఆస్పత్రికి తరలిస్తారు.

పొగడదొరువు
73821 68168