Jul 14,2023 00:34

కాయల సేకరణ, విక్రయంలో మహిళలు

ప్రజాశక్తి - మాచర్ల : సరైన వర్షాల్లేక.. వ్యవసాయ పనులు మొదలవ్వక.. ఉపాధి కరువై పూట గడవడం కష్టమైన పేదలను ఆడవి తల్లి ఆదుకుంది. పొలం పనుల్లేని మాచర్ల పరిసర ప్రాంత గిరిజన మహిళలు అడవిలో రొరికే జానపళ్లను తెచ్చి పట్టణంలో అమ్ముకుని ఉపాధి పొందుతున్నారు. ఖరీఫ్‌ ప్రారంభమైనా సాగుకు అనువైన వర్షం ఇంకా పడకపోవడంతో వ్యవసాయ ప్రారంభం కాలేదు. వ్యవసాయ కూలీలుగా జీవించే వారు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంతా గ్రామాలకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో జానకాయలు, చింతచిగురు సేకరించి వాటిని పట్టణంలో అమ్ముతున్నారు. వెల్ధుర్తి మండలం శ్రీరామపురం తండాకు చెందిన గిరిజన మహిళలు మాచర్ల శ్రీశైలం రహదారిలోని మండాది వద్ద అటవీ ప్రాంతంలో జానకాయలు సేకరించి, వాటి అమ్మకం ద్వారా రోజు రూ.400 సంపాందిస్తున్నారు. పొలం పనులుంటే తమకు పని ఉండేదని, ప్రస్తుతం ఇంట్లో జరుగుబాటుకు ఇబ్బందిగా ఉండటంతో మహిళలం జానకాయలు అమ్మేందుకు వస్తున్నామని తండాకు చెందిన బాణావత్‌ లాలిబారు తెలిపారు. ఉదయాన్నే అన్నం తిని 8 గంటలకు అడవికి వచ్చి, మధ్యాహ్నం 1 గంట వరకు కాయలు కోసుకోని వాటితో మాచర్లకు చేరుకుని, సాయంత్రం 4 గంటల కల్లా అమ్ముకొని పోద్దుపోయేలోపు ఇంటికి చేరుతున్నామని వివరించారు. తాము సంపాదించే రూ.400లో ఛార్జీలకు రూ.100 ఆవుతుందని చెబుతున్నారు. వర్షాలు పడితే పొలం పనులు ప్రారంభం ఆవుతాయని, అప్పటి వరకు కుటుంబం గడవడానికి ఏదో తిప్పలు పడక తప్పదని మహిళలు చెబుతున్నారు. నెలరోజులుగా ఇదే దిన చర్యగా బతుకుతున్నామంటున్నారు. ప్రస్తుతం అడవిలో కాయలు కూడా అయిపోతున్నయని, వ్యవసాయ పనుల కోసం నిరీక్షిస్తున్నామని చెప్పారు.