Dec 19,2022 16:09

ప్రజాశక్తి - భీమడోలు
              ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపద మిత్ర వ్యవస్థను ప్రవేశపెట్టిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చే మేనేజర్‌ జి.ప్రసంగిరాజు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా స్థాయిలో ఆరు మండలాలకు చెందిన ఆపద మిత్రలకు గత 12 రోజులుగా నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇడబ్ల్యూఎస్‌ఇడబ్ల్యూ 500 మంది ఆపద మిత్ర వాలంటీర్లకు వివిధ అంశాల్లో 17 శాఖల బాధ్యులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాయి. ఆపదమిత్ర వాలంటీర్లకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వారు మండలంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా భీమడోలు సమీపంలోని ఏలూరు కాలువ వద్ద నీట మునిగిన వారిని రక్షించటం, వారికి ధైర్యాన్ని కల్పించటం, అవసరం మేరకు ప్రథమ చికిత్స అందించడంతో పాటు వారిని చికిత్స కోసం సమీపంలో ఉన్న వైద్యశాలకు తరలించే విషయమై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి అదనంగా రెండో అంశంలో భాగంగా కొల్లేరులంక గ్రామమైన లక్ష్మీపురంలో తరచూ చోటు చేసుకునే అవకాశం కల తుపాను, వరద, కరువు వంటి అంశాలను గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా శిక్షణ మేనేజర్‌గా వ్యవహరించిన జి.ప్రసంగిరాజు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, ఇతర అంశాలు చోటు చేసుకున్నప్పుడు ప్రజల, పశువుల ప్రాణ రక్షణ, ఆస్తి నష్టం తగ్గించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం గ్రామస్థాయిలో నియమితులైన ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఇప్పటికే ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమంలో భాగంగా గత 12 రోజులుగా 17 శాఖల ఆధ్వర్యంలో వివిధ అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం వారికి పలు అంశాలపై క్షేత్రస్థాయిలో శిక్షణా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆపద మిత్రలు రానున్న ప్రమాదాల గురించి హెచ్చరికలు చేయటం, ప్రజలను అప్రమత్తం చేయటం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆపదలో ఉన్న వారిని కాపాడటం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం ప్రాజెక్ట్‌ మేనేజర్‌, అగ్నిమాపక సేవల జిల్లా అధికారి సిహెచ్‌.రత్నబాబు మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్రస్థాయిలో 126 జిల్లాలకు చెందిన 5400 మంది ఆపద మిత్రలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 500 మంది ఆపద మిత్రలకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆపదమిత్రలు ఒక్కొక్కరికి రూ.12 విలువైన కిట్‌ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి స్పెషల్‌ పోలీస్‌ ఎఎస్‌ఐ ఎన్‌.చాంద్‌కుమార్‌, గణపవరం పంచాయతీ విస్తరణ అధికారి పివి.సత్యనారాయణ, భీమడోలు గ్రామపంచాయతీ కార్యదర్శి ఎన్‌.ఠాగూర్‌ తో పాటు ఆపదమిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు.