Aug 02,2021 21:19

- గతేడాదికి కూడా మార్కులు
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :
పదో తరగతి 2020- 21 విద్యాసంవత్సరం విద్యార్థుల మార్కుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొలిక్కి తీసుకొచ్చింది. పదో తరగతి మార్కులపై స్పష్టత ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఎ) పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా 70 శాతం వెయిటేజ్‌ ఇవ్వనుంది. సమగ్ర మూల్యాంకనం విధానం ఆధారంగా 30 శాతం మార్కులు ఉంటాయని తెలిపింది. మొత్తం 100 మార్కుల ఆధారంగా గ్రేడులు, అందరూ ఉత్తీర్ణులవుతారని, చివరి గ్రేడులు కూడా ఉంటాయని పేర్కొంది. ఫార్మెటివ్‌ రాయని విద్యార్థులకు, రాసినా ఆన్‌లైన్‌లో నమోదు చేయని విద్యార్థులకు చివరి గ్రేడ్‌ ఇచ్చి ఉత్తీర్ణులు చేయనుంది. 2020 విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్థులకూ గ్రేడులు ఇవ్వనుంది. గతేడాది సమ్మెటివ్‌ా1లో వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం, మూడు ఎఫ్‌ఎల్లో (మొత్తం) వచ్చిన మార్కుల ఆధారంగా 50 శాతం వెయిటేజ్‌ ఇవ్వనుంది. 2017, 2018, 2019 పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన అంతర్గత మార్కులను బట్టి గ్రేడులు ఉంటాయని తెలిపింది.