Aug 03,2021 19:38
చేబ్రోలు పిహెచ్‌సి వైద్యాధికారి, సిబ్బందిని సత్కరిస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యులు తదితరులు..

ప్రజాశక్తి-ఉంగుటూరు (పశ్చిమగోదావరి) : పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు పిహెచ్‌సికి జాతీయస్థాయి అవార్డు దక్కింది. నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ పథకం కింద గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడు పిహెచ్‌సిలకు అవార్డులు ప్రకటించింది. అందులో మన రాష్ట్రం నుంచి చేబ్రోలు పిహెచ్‌సి ఆ ఘనత సాధించింది. జాతీయ నాణ్యతా ప్రమాణాల కమిటీ ఈ ఏడాది జూన్‌ 17న వర్చువల్‌ విధానంలో చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించింది. రోజుకు ఎంత మంది వైద్య సేవలు పొందుతున్నారు, ప్రసూతి విభాగం తీరు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ, ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించింది. ఈ క్రమంలో ఉత్తమ పనితీరుకు జాతీయ పురస్కారం దక్కింది.