Aug 03,2021 19:17

అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజుకి ఎపి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ఎపి హైకోర్టు తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అశోక్‌ గజపతిరాజు ప్రోద్భలంతోనే మాన్సాస్‌ ట్రస్ట్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే. మాన్సాస్‌ ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడంతో గతనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్‌ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఆ సమయంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి.. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.