Aug 03,2021 20:51

ప్రజాశక్తి-అమరావతి : 'ప్రధాన పంట కాలువ మాయమైందంటే అధికారుల అలసత్వమే కారణం. ఇలాంటివి రాత్రికి రాత్రి జరగవు. నిర్లక్ష్యం వల్లే వనరుల దోపిడీకి ప్రధాన కారణం. అధికారుల నిఘా నేత్రం మూసుకుపోవడం వల్లే అక్రమార్కుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇలాంటి వాటిని చూస్తూ కూర్చోం... తీవ్రంగానే స్పందిస్తాం...' అని పరిటాల గ్రామంలో అక్రమ మైనింగ్‌పై దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో కొండల్ని పేల్చుతూ అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని గ్రామస్తుడు మాగంటి ధర్మారావు పిల్‌ దాఖలు చేశారు. దీనిని మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై మాజీ ఎమ్మెల్సీ టిజివి కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌తో పరిటాలలో అక్రమ మైనింగ్‌పై పిల్‌ను కూడా కలిపి విచారణ జరుపుతామని ప్రకటించింది. రెండు పిల్స్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నెల 6న విచారణ జరుపుతామని ప్రకటించింది.

పరిటాల గ్రామంలో కొండలను పేల్చుతూ... అక్రమ మైనింగ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, మైనింగ్‌కు అనుమతుల్లేవని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం ఇచ్చిందని పిటిషనరు తరుపున న్యాయవాది పేర్కొన్నారు.