AP High Court : ఆక్సిజన్ సరఫరా జాప్యం వల్లే మరణాలు.. 'రుయా' ఘటనపై హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం!

అమరావతి : తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఎపి హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆక్సిజన్ సరఫరా జాప్యం వల్లే కరోనా బాధితులు మృతి చెందారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారని, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించామని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపింది. ఇటీవల రుయా ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో చనిపోయిన కరోనా బాధితులకు ప్రభుత్వం రూ.కోటి నష్ట పరిహారం అందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 5 ఆక్సిజన్ ప్లాంట్స్ వెంటనే నెలకొల్పాలని, కరోనా బాధితులకు మందులు, ఆక్సిజన్ అవసరమైన ఇతర సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందించాలని, రుయా ఆసుపత్రి ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని పిటిషన్‌లో తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం శనివారం వేసిన కౌంటర్ పిటిషన్‌లో పై విధంగా పేర్కొంది.