Jul 26,2021 11:29

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌లో వచ్చారు. కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా ఆయనే స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సమయంలో తెల్లటి షర్‌, ట్రౌజర్‌, ఫేస్‌మాస్క్‌ ధరించి వచ్చారు. 'రైతుల సందేశాన్ని నేను పార్లమెంట్‌కు తీసుకొచ్చాను. కేంద్రం అన్నదాతల గొంతును నొక్కేస్తోంది. దీనిపై చర్చించేందుకు పార్లమెంట్‌లో అనుమతినివ్వట్లేదు. మోడీ సర్కార్‌ ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలి. ఈ చట్టాలు కేవలం 2-3 బడా వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చేందుకేనని దేశం మొత్తం తెలుసు' అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం..రైతులు ఈ చట్టాలతో ఆనందంగా ఉన్నారని, నిరసనలు తెలుపుతున్న వారంతా ఉగ్రవాదులన్న ముద్ర వేస్తుందని పేర్కొన్నారు. కానీ వాస్తవంలో రైతుల హక్కులను కాలరాసిందని అన్నారు.