Mar 19,2023 15:38

ప్రస్తుతం ఓటీటీ హవా కొనసాగుతోంది. దీంతో అనేకమంది కొత్త దర్శకులు, నటీనటులు, కొత్త కథలకు ఇది వేదికవుతోంది. రన్‌టైంతో సంబంధం లేకుండా వెబ్‌సిరీస్‌లు, చిత్రాలు విడుదల అవుతున్నాయి. దీంతో కొత్త అవకాశాలు వస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ కొత్త, యువ నటులతో పెద్ద నటీనటులూ కలిసి పనిచేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ తరుణంలో అంథాలజీలో 'యాంగర్‌ టేల్స్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్‌ యాప్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉందో? కథేంటో తెలుసుకుందాం..
కథలోకి వెళ్తే.. నలుగురు వ్యక్తులకు సంబంధించిన నాలుగు వేర్వేరు కథల సమాహారం ఈ 'యాంగర్‌ టేల్స్‌'. ఈ నలుగురు తమ జీవితంలో పరిస్థితులతో చాలా విస్తుపోయి, పట్టరాని కోపంతో కనిపిస్తారు. ఇక మొదటి ఎపిసోడ్‌ రంగా (వెంకటేష్‌ మహా) ఓ స్టార్‌ హీరో ఫ్యాన్‌ అయిన తాను తన హీరో బెనిఫిట్‌ షో కోసం రంగంలోకి దిగుతాడు. టికెట్లు అమ్మడం సహా అన్ని పనులూ తానే చూసుకుంటాడు. చెప్పిన సమయానికి చిత్రాన్ని ప్రదర్శించ లేకపోవడంతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ క్రమంలో ఏం చేశాడు? అనేది కథ.. ఇక రెండో కథ పూజారెడ్డి (మడోనా సెబాస్టియన్‌) ఆమెకి పెళ్లయ్యాక.. తిండి విషయంలో అత్తవాళ్లు పెట్టే కట్టుబాట్ల విషయంలో తనకి నచ్చిన ఆహారాన్ని కూడా తీసుకోలేని స్వేచ్ఛ లేనందున తీవ్ర అసంతృప్తితో ఉంటుంది. ఇక మరోకథ రాధ (బిందు మాధవి) అనే ఓ సాధారణ గృహిణి తన నిద్ర విషయంలో తన ఓనర్‌, వాళ్ల బంధువుల విషయంలో ఎదురైన సమస్యలు ఏంటి? ఫైనల్‌గా గిరిధర్‌ (ఫణి ఆచార్య) అనే మధ్య వయస్కుడు తన బట్టతల మూలాన తన పర్సనల్‌, ప్రొఫిషినల్‌ లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు? మరి వీరి జీవితాలలో తమ యాంగర్‌ మేనేజ్మెంట్‌ ఎలా ఉంది? ఈ అంథాలజీలో ప్రధానంగా కనిపించే అంశాలేంటి? వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? వారి కథలకి ముగింపు ఎలా ఉంటుంది? అనేది తెలియాలి అంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.
ఈ సిరీస్‌లో కథలు వేరైనా, ప్రధానపాత్రల భావోద్వేగం ఒక్కటే. కారణాలు వేరైనా, అన్ని క్యారెక్టర్లూ కోపం ప్రదర్శిస్తాయి. నాలుగు విభిన్న కథలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు దర్శకుడు తిలక్‌. 'ఇలానే నేనూ ఎదుర్కొన్నా, ఈ అనుభవం నాకూ ఉంది' అని చాలామంది ఆడియన్స్‌ ఏదో ఓ కథ విషయంలోనైనా అనుకునే అవకాశాలు ఉన్నాయి. 'బెనిఫిట్‌ షో'లో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్స్‌ హంగామా.. టైమ్‌కు షో వేయకపోతే థియేటర్‌ యజమానులు ఎదుర్కొనే ఒత్తిడి.. చూపించారు. తెరకెక్కించాలనే ఉద్దేశమో, లేదా 'ఓటీటీనే కదా' అనుకున్నారో.. అక్కడక్కడా అభ్యంతరకర పదజాలం వాడారు. ఆయా సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.
ఇక 'ఫుడ్‌ ఫెస్టివల్‌' లో స్వేచ్ఛలేని మహిళల మనోభావాలను ఆవిష్కరించారు. ఈ పాత్రలను మరింత బలంగా చూపించి ఉండాల్సింది. భావోద్వేగాలకు పెద్దపీట వేసే ఈ కథలో అదే మిస్‌ అయింది. 'ఆఫ్టర్‌నూన్‌ న్యాప్‌'లో సగటు మధ్యతరగతి గృహిణి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. భార్యాభర్తల గిల్లికజ్జాలు, త్వరలోనే తమ జీవితంలో మార్పు వస్తుందనే ఆశ, ఇంటి ఓనర్‌తో చిన్న చిన్న గొడవలు.. ఇలా మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీలో చోటుచేసుకునే వాటిని సహజంగా తెరపైకి తీసుకొచ్చారు. 'హెల్మెట్‌ హెడ్‌' విషయానికొస్తే.. నేటి యువతలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో బట్టతల ఒకటి. పెళ్లికానివారు దానివల్ల ఎంతగా బాధపడతారో చెప్పారు. జుట్టు ఊడిపోవడానికి కారణమేంటో తెలుసుకుని, కేసు వేయడం భిన్నంగా సాగుతుంది.
'కేరాఫ్‌ కంచరపాలెం'తో సెన్సేషన్‌గా మారిన దర్శకుడు వెంకటేశ్‌ మహా తనలోని నటుడిని గతంలోనే పరిచయం చేశారు. కానీ, పూర్తిస్థాయి పాత్ర పోషించడం ఇదే తొలిసారి. ఇందులోని రంగ పాత్రలో ఒదిగిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సుహాస్‌ నెగెటివ్‌ ఛాయలున్న పాత్రకు న్యాయం చేశారు. కనిపించింది కాసేపే అయిన తన నటనతో మెప్పించాడు. 'ఆవకారు బిర్యాని', 'బంపర్‌ ఆఫర్‌', 'పిల్ల జమీందార్‌' చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన బిందు మాధవి ఇందులో రాధగా చక్కటి హావభావాలు ప్రదర్శించారు. కొత్త నటుడైనా ఫణి.. గిరిధర్‌గా మెప్పిస్తారు. తరుణ్‌ భాస్కర్‌, మడోన్నా, సుధ తదితరులు ఫర్వాలేదనపించారు. ఫస్ట్‌ ఎపిసోడ్‌లోని ఓ పాట, నేపథ్య సంగీతం అలరిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సాగదీతను తగ్గించి, ఎపిసోడ్ల నిడివి తగ్గించి ఉంటే సిరీస్‌ ఇంకా బాగుండేది. టెక్నికల్‌గా యాంగర్‌ టేల్స్‌ బాగుంది. నేపధ్య సంగీతం పెద్ద ప్లస్‌ అని చెప్పొచ్చు. ఇక ఛాయాగ్రహణం ఫర్వాలేదు. మొత్తం మీద, యాంగర్‌ టేల్స్‌, ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్‌ అంథాలజీ.
టైటిల్‌: యాంగర్‌ టేల్స్‌
నటీనటులు: వెంకటేష్‌ మహా, సుహాస్‌, రవీంద్ర విజరు, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్‌ భాస్కర్‌, మడోన్నా సెబాస్టియన్‌
దర్శకుడు : ప్రభల తిలక్‌
నిర్మాతలు: శ్రీధర్‌ రెడ్డి, సుహాస్‌
సంగీత దర్శకులు: స్మరణ్‌ సాయి
సినిమాటోగ్రఫీ: అమర్‌దీప్‌, వినోద్‌ కె బంగారి, వెంకట్‌ ఆర్‌ శాఖమూరి, ఎజె ఆరోన్‌
ఎడిటర్‌: కోదాటి పవన్‌ కళ్యాణ్‌
ఓటీటీ: డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌