Jun 20,2021 12:08

'అక్కయ్య ఫోన్‌ చేసింది. వాళ్ళబ్బాయి మనింట్లో ఓ నాలుగు రోజులు ఉంటాడట..!'
అప్పుడే ఆఫీస్‌ నుండి ఇంటికొచ్చిన వరుణ్‌తో అంది వనజ.
భార్య మాట వినగానే ఉలిక్కిపడ్డాడు వరుణ్‌.
'బాగా అలసిపోయాను. నన్ను విసిగించకు' అని హెల్మెట్‌ వనజ చేతికిచ్చి, బాత్రూమ్‌లోకి దూరాడు. ఫ్రెష్‌ అయ్యి బయటకు వచ్చేటప్పటికి వనజ వేడివేడిగా నురగలు కక్కుతున్న కాఫీ కప్పుతో నిల్చొని ఉంది. 'వేడిగా వున్నాను 'వాడి'గా చూడకు' అన్నాడు హాల్లో సోఫాలో కూర్చుంటూ! వరుణ్‌ పక్కన కూర్చుంటూ 'కాఫీ కూడా వేడిగానే ఉంది శ్రీవారూ' అంది కాఫీ చేతికందిస్తూ! 'ప్రాసలు మాట్లాడకు' కాఫీ కప్పు అందుకుంటూ వనజ కేసి కోపంగా చూసాడు.
'మీ అక్క కొడుకు.. అదే ఆ బాలభీముడు వస్తున్నాడుగా! కొంప నాశనం చేయడానికి. కోపంకాక మరే ముంటుంది?' విసుక్కుంటూ అన్నాడు.
వనజ, వరుణ్‌ మాటలకు ఉడుక్కుంటూ 'వాడి పేరు భీమేష్‌! బాలభీముడు కాదు. అయినా వాడంటే మీకెందుకు కంటగింపు? నిండా ఏడైళ్ళైనా లేవు' మూతి మూడు వంకర్లు తిప్పుతూ అంది.
'వాడంటే భయం వనజా! కోపం కాదు.. నామీద నాకు జాలి' అన్నాడు దీనంగా.
'అదిగో! ఆ టీవీ పక్కన ఉన్న టీపారు చూడు!' వనజకు చూపిస్తూ అన్నాడు.
'టీపారులో వింతేముంది? కొత్తది కదా! బావుంది' అంది.
'ఆహా! అయితే ఆ గోడ గడియారం వంక చూడు!' అన్నాడు.
'గోడగడియారానికేం? నిక్షేపంగా వుంది. ఇప్పుడే ఏడు గంటలైనందుకు టంగు టంగు మంటూ కరెక్ట్‌గా ఏడు గంటలూ కొట్టింది. ఇదీ కొత్తదే కదా?!' అంది.
'ఓహో! అయితే బయట గుమ్మం పక్కన కిటికీ అద్దం చూడు'! మళ్ళీ అన్నాడు.
'కిటికీ అద్దానికే మెరిసిపోతోంది. ఇదీ కొత్తదే కదా! ఈరోజు ఇవన్నీ ఎందుకు వింతగా చూడమంటున్నారు? రోజూ చూసేవే కదా!' అడిగింది వనజ.
వరుణ్‌ ఏడవ లేక నవ్వు మొహం పెట్టుకుని 'వనజా! ఇవన్నీ కొత్తవే! కానీ వాటికి ముందున్న పాత వాటిని పాతాళంలోకి నెట్టేసిన వామనుడు నీ భీముడు. బలి చక్రవర్తిలా 'వాడి'చేతిలో అవన్నీ ''బలై''పోయాయి. ఇప్పుడు నా బాధ, భయం అంతా కొత్తగా కొన్న ఆ ఎల్‌ ఈ డి టీవీ మీదే ఉందే! టీవీ అప్పు కూడా ఇంకా తీరనేలేదు. టీవీపోతే తట్టుకోలేనే! తుఫానులా వచ్చే వాడి రాకతో ఈ వస్తువులన్నీ ఎలా గజగజ వొణికిపోతున్నాయో చూడు!' వాటికేసి జాలిగా చూస్తూ అన్నాడు.
'చాల్లెండి.. ఊరుకుంటూంటే పసివాడిపై పగపట్టినట్లు మీరలా మాట్లాడటం ఏమీ బాలేదు' అంది కోపంగా.
'పగ కాదే! భయం. సరే.. ఇవన్నీ వదిలేద్దాం. మన పక్క వాటాలో ఉంటున్నారే! అదే.. గుండు నున్నగా, జుట్టు సన్నగా వుంటూ 'అరగుండు అప్పారావు'గారని పిలుస్తామే ఆయన..!' వరుణ్‌ చెబు తూ ఉండగా 'ఆయన కేమైందండి? కొంపదీసి పోయా....'? అంది చెయ్యి పైకి చూపిస్తూ.
'ష్‌..! ఆయన గుండ్రారులా బాగానే ఉన్నాడు. మీ భీముడే అప్పుడు క్రికెట్‌ బంతితో స్టేడియంలా ఉన్న ఆయన గుండుమీద కొట్టాడు కదా! ఆ క్షణం మర్చిపోగలనా? సిక్సర్‌ అంటూ భీముడు కేరింతలు ఒక వైపు, ఔట్‌ అయిపోయానంటూ అప్పారావు అరుపులు మరోవైపు. రెండువైపులూ చూడలేక డాక్టర్‌ కోసం నేను పడిగాపులు. పగటిపూట చుక్కలు చూపించాడే మీ భీముడు. ఇప్పటికీ ఆ అరగుండు అప్పారావు కనపడ్డప్పుడల్లా నేను నవ్వినా, బదులుగా ఏడుస్తాడే! తలపోటు ఇప్పటికీ తగ్గలేదంటూ ఓవంద లాక్కుపోతాడు..' వరుణ్‌ చెబుతుంటే తలుపు తట్టినట్లు వినబడేసరికి 'వనజా! చూడవే! మీ భీముడేమో?' భయంగా గుమ్మంకేసి చూస్తూ అన్నాడు వరుణ్‌.
'ఊరుకోండి.! పసిపిల్లాడు దెయ్యం అంటే భయపడినట్లు అనవసరంగా భయపడుతున్నారు మీరు. తలుపు తట్టింది పాలబ్బాయి. భీముడు కాదు.. అబ్బా! మీ మాటల వలన నేను కూడా మా భీమేష్‌ను పట్టుకొని భీముడు అనాల్సి వచ్చింది. పిల్లలన్నాకా ఆ మాత్రం అల్లరి చేయరా ఏమిటీ?' పాలు పోయించుకుని పాలగిన్నె పొయ్యిమీద పెడుతూ అంది.
'ఆ! మీ అక్కకొడుకు కాబట్టి సమర్ధించుకున్నావ్‌.. అదే వయసున్న మా అక్క కొడుకు రాముడు ఇలా అల్లరి చేస్తాడా? పేరుకు తగ్గట్టు వాడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉంటాడు. కూర్చోమంటేనే కూర్చుంటాడు. పడుకోమంటేనే పడుకుంటాడు.పెద్దల మాట జవదాటడు. మీ భీముడు అల్లరివాడు. మా రాముడు అందరివాడు..అర్థమయ్యిందా?' అంటూ గొప్పగా చెప్పాడు.
'సరేలెండి. పొద్దున్నే వాళ్ళు వస్తారు. తొందరగా లేవాలి. తిని పడుకోండి'.అంది. 'మీ భీముణ్ణి తలుచుకుంటూ ఉంటే నిద్ర రాదు. ఎలాగే పడుకునేది?' పైకి అంటే వనజ ఉడుక్కుంటుందని మనసులో అనుకున్నాడు వరుణ్‌. నిద్రకు సిద్ధం అయ్యాడు.
తెల్లవారగానే 'వర్రూ మామయ్యా!' అంటూ అరుపు వినబడే సరికి ఉలిక్కిపడి, మంచం పైనుండి దిగ్గున లేచాడు వరుణ్‌. ఎదురుగా అతని మేనల్లుడు రాముడు. 'రాముడూ! ఆరి పిడుగా! నువ్వెప్పుడొచ్చావురా?' మేనల్లుడిని అభిమానంగా దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. 'నేను రాలేదు! అమ్మ తీసుకొచ్చింది! జోక్‌ బావుందా వర్రూ మామయ్యా?' వరుణ్‌ మీసం లాగుతూ అడిగాడు రాముడు.
'తమ్ముడూ! నాకు ట్రైనింగ్‌ క్లాసులున్నాయి రా! మీ బావగారు క్యాంప్‌లో వున్నారు. ఓ నాలుగు రోజులు రాముడు ఇక్కడే ఉంటాడు. వనజ నీకు చెప్పే వుంటుందిలే!' గ్యాప్‌ లేకుండా గబగబా చెప్పేస్తున్న అక్కకేసి చూస్తూ ఉండిపోయాడు వరుణ్‌. 'నాకు బస్‌ టైమ్‌ అవుతోంది. వస్తానూ! వనజా బై..! రామూ! జాగ్రత్త. బుద్ధిగా వుండు. అల్లరి చేయకు!' అంటూ వడివడిగా వెళ్లిపోతున్న తన అక్కకు టాటా చెప్పాడు వరుణ్‌.
'మీ అక్క అని చెప్పావ్‌! వచ్చింది మా అక్క, నా మేనల్లుడు కదా! అబద్ధం ఎందుకు ఆడావ్‌?' చిరుకోపంతో వనజను అడిగాడు. 'అక్కయ్య ఫోన్‌ చేసింది అన్నాను..మీ అక్కయ్యా? మా అక్కయ్యా? అని మీరడిగారా? సరిగ్గా వినకుండా భీమేష్‌ మీద పడ్డారు!' అంది వనజ మూతి తిప్పుకుంటూ. 'చెప్పానుగా భీముడంటే నాకు భయం అని. మళ్లీ చెబుతున్నాను మా రాముడు బుద్ధిమంతుడు'! గొప్పగా అన్నాడు వరుణ్‌.
'ఈ ఇంట్లో టీవీ, గడియారం అన్ని వస్తువులూ హాయిగా వుండచ్చు. ఎందుకంటే వాడు రాముడు, భీముడు కాదు!' గర్వంగా మీసం మెలేశాడు వరుణ్‌.
'చూద్దాం! అతిగా ఆనందపడకండి' అని వంటింట్లోకి వెళ్ళింది వనజ.
'వర్రూ మామయ్యా! ఇలా చూడు' అంటూ రాముడు హాలుకి, బెడ్‌రూమ్‌కి మధ్యన ఉన్న కామన్‌ బాత్రూం టాప్‌ గట్టిగా లాగాడు. గట్టు తెగిన గోదావరి వరద నీరులా ట్యాంక్‌లో నీరంతా హాల్లోకి వచ్చేస్తోంది. ఒక్కక్షణం చేష్టలుడిగిన వాడిలా ఏం చేయాలో దిక్కుతోచని అచేతన స్థితిలో అలా చూస్తుండిపోయాడు వరుణ్‌.
'మామయ్యా! అలా జెండా కర్రలా నిలబడి పోయావే? చక్కగా కాగితం పడవలు ఎంచక్కా చేయచ్చుగా! నీటిలో వేసుకుని ఆడుకుంటాను' అంటూ రాముడు వాడు వేసుకున్న షర్ట్‌విప్పి ఆ నీటిలో వేసి తిరిగి పిండుకుంటూ 'రా.. వర్రూ మామయ్యా! ఆడుకుందాం!' మళ్ళీ అన్నాడు. కుడితిలో పడ్డ ఎలుకలా అయ్యింది వరుణ్‌ పరిస్థితి.. ఏం చెయ్యాలో? అర్థం కావట్లేదు. వనజకేసి చూశాడు. చిరునవ్వుతో వంట చేసుకుంటోంది.
'వనజా! వరద నీరు తగ్గే మార్గం చెప్పవే'! వేడుకుంటూ అడిగాడు. 'మీ రాముడు మంచి బాలుడు. అల్లరి చేయడు.. ఇంకాసేపు ఆడుకొనివ్వండి!' తాపీగా అంది.
'వనజా! పుండుమీద కారం చల్లకే! ఉపాయం చెప్పవే' బ్రతిమాలుతూ అడిగాడు.
'వర్రూ మామయ్యా? పడవలు చేశావా? రాముడు నీటిలో ఆడుకుంటూ అడుగుతున్నాడు.
'మేడమీద నీళ్లట్యాంక్‌ వద్ద కెళ్ళి మెయిన్‌ వాల్వ్‌ ఆఫ్‌ చేయండి. అంతలో వాడు పీకేసిన టాప్‌ పెట్టడం చేస్తాను' అంటూ ఐడియా ఇచ్చింది వనజ.
'నిజమే! ఇప్పుడే మెయిన్‌ వాల్వ్‌ ఆఫ్‌ చేస్తా'నంటూ మేడపైకి వెళ్లివాల్వ్‌ కట్టేసి కిందకు వచ్చాడు.
'హమ్మయ్య! వర్షం వెలిసింది' అనుకుంటూ తేలిగ్గా ఊపిరి పీల్చాడు. కానీ అప్పటికే అరగుండు అప్పారావు హాల్లో కోపంగా పచార్లు చేస్తున్నాడు. వరుణ్‌ని చూడగానే తోక తెగిన కోతిలా 'ఏమయ్యా వరుణ్‌? మీ ఇంట్లో నీరు ఏరులా పారుతోందని ట్యాంక్‌ ఆఫ్‌ చేశావ్‌ సరే? మరి మా ఇంట్లోకి నీరు రావద్దా? మా అవసరాలు తీరొద్దా?' గుర్రుగా చూస్తూ అడిగాడు.
'కోప్పడకండి! ఇప్పుడే ట్యాంక్‌ ఆన్‌ చేస్తా'నంటూ పైకి వెళ్ళాడు. ట్యాంక్‌ ఆన్‌చేసి కిందకు వచ్చాడు. 'ఇంకా అప్పారావు తనింట్లోనే ఉన్నాడెందుకు?' అని వరుణ్‌ అనుకునే లోపే 'ఏమయ్యా వరుణ్‌! నామీద కోపం కొద్దీ ఈ పిల్లాడి చేత నాకు నీళ్లతో అభిషేకం చేయిస్తావా? నీకిదేమైనా న్యాయంగా ఉందా? నాతో డైరక్ట్‌గా ఫేస్‌ టు ఫేస్‌ తలపడు. ఇలా ఇండైరెక్ట్‌గా వద్దు' అంటూ తడిసిన అరగుండును తన చుక్కల చొక్కాతో తుడుచుకోసాగాడు అప్పారావు.
వరుణ్‌కు రాముడి మీద కోపం ఎక్కువై కళ్లెర్ర చేస్తూ చేయి పైకెత్తాడు.అంతే రాముడు ఆరునొక్క రాగాన్ని డిటి ఎస్‌లో అందుకున్నాడు. వరుణ్‌ తన మేనల్లుడిని ఎలా ఊరుకోబెడతాడా? అని ఎదురు చూస్తోంది వనజ.
అరగుండు అప్పారావు మళ్ళీ రంగప్రవేశం చేసి 'ఏమయ్యా వరుణ్‌? నాకసలే హార్ట్‌లో హోల్‌. ఇలాంటి అరుపులు వింటే ఇప్పుడే చచ్చేలా వున్నాను. నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. నేను మా ఆవిడకి ఒక్కగానొక్క మొగుడ్ని. ఆవిడ గతేం కాను? మమ్మల్ని బతక మంటావా? చావ మంటావా'? కోపంతో ఊగిపోతూ అడిగాడు.
'మీరు చావద్దు! నన్ను చంపద్దు! దయచేయండి మహానుభావా'! అంటూ ఒక్క అరుపు అరిచాడు వరుణ్‌. అరగుండు అప్పారావు నెమ్మదిగా జారుకున్నాడు. వనజ కిసుక్కున నవ్వుతోంది.
వరుణ్‌ వనజ దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారిగా మోకాళ్ళమీద కూర్చున్నాడు. 'వనజా! బుద్ధి తక్కువై మీ భీముణ్ణి తిట్టాను. పిల్లలంతా ఇంతే అని తెలుసుకున్నాను. 'అన్యధా శరణం నాస్తి'..మాయలే చేస్తావో? మంత్రమే వేస్తావో? వాడి అల్లరి తగ్గించు. గండం గట్టెక్కించు' లెంపలేసుకుంటూ ప్రాధేయపడ్డాడు వరుణ్‌.
'అలా రండి దారికి. మీరెళ్ళి పది నిముషాలు బెడ్‌ రూంలో కూర్చోండి'! అంటూ వనజ రంగంలోకి దిగింది. అంతే! మరుక్షణంలో రాముడు అల్లరిమాని బుద్ధిగా కూర్చున్నాడు.
'క్షణంలో తుఫాను తీరం దాటినట్టుగా, రాముడి అల్లరిని ఎలా కట్టడి చేశావ్‌ వనజా?' ఆశ్చర్యపోతూ అడిగాడు వరుణ్‌. 'ఇలా!' అంటూ ఐస్‌క్రీమ్‌ చూపించింది. అప్పుడు రాముడు కేసి చూశాడు వరుణ్‌. వాడు యుద్ధంలో గెలిచి, అలిసిపోయిన వీరుడిలా ప్రశాంతంగా ఐస్‌క్రీమ్‌ తింటున్నాడు. 'పిల్లలూ, దేవుడూ చల్లని వారే శ్రీవారూ'! అందుకే వాళ్ళు ఐస్‌క్రీమ్‌ అంటే చాలా ఇష్టంగా తింటారు. 'ఐస్‌క్రీమ్‌ అయిపోతే మళ్ళీ అల్లరి మొదలు పెడతారుగా?' భయపడుతూ అడిగాడు వరుణ్‌. 'ఏముంది? పిల్లలన్నాకా అల్లరి సహజం. పెద్దలైన మనమే వారి స్థాయికి దిగిరావాలి. వాడితో ఆడాలి, పాడాలి. వాళ్ళతో కలిసి పోవాలి. వాళ్ళు అల్లరి చేసి వస్తువులను పాడు చేస్తున్నారంటే వాళ్ళనెవ్వరూ పట్టించుకోవడం లేదని, మన అటెన్షన్‌ వాళ్లకేసి మరల్చడానికే అలా చేస్తున్నారని అర్థం. అంతేకానీ పిల్లలు మన వస్తువులు పాడుచేస్తున్నారని తిట్టినా, ఒక సెల్‌ఫోన్‌ ఇచ్చేసి ఆడుకోమన్నా అది మొదటికే మోసం !.తెలుసుకోండి' అంది వనజ.
'నువ్వన్నది నిజం వనజా! పిల్లలను దూరంగా వెళ్లిపొమ్మని విసుక్కోకూడదు'! అంటూ రాముడి వద్దకు వెళ్ళాడు. వాడిని అనునయంగా దగ్గరకు తీసుకున్నాడు. 'వనజా! భీముడినీ రప్పించు. రాముడికి జోడిగా ఉంటాడు' అన్నాడు వరుణ్‌. 'ఏం పాపం? ఒక్కడు సరిపోలేదా?' నవ్వుతూ అంది వనజ.!
 

- కె.వి. లక్ష్మణరావు
90146 59041