
ప్రజాశక్తి - కొవ్వూరు రూరల్ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ విమర్శంచారు. సిపిఎం పట్టణ కార్యదర్శి దగ్గు రాధాకృష్ణ అధ్యక్షతన స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తలు, సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ పాలన సాగిస్తున్న పాలక పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, రాష్ట్రంలోని పోర్టులు, అడవులను అదానికీ ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం కట్టబెడుతుంటే, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం అదానీకి అండగా నిలుస్తుం దని విమర్శంచారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టిడిపి, జనసేన పార్టీలు నిస్సగ్గుగా బిజెపికి అండగా నిలవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలను ప్రజల్లో చర్చకి పెట్టి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సిపిఎం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల నుంచి మూడు జాతాలను ప్రారంభించిందని తెలిపారు. శ్రీకాకుళంలో బయలుదేరిన జాత ఈనెల 6న రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ఆ సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ వద్ద భారీ బహిరంగ ఊసభను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సభలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బయలుదేరిన మూడు జాతాలు 15న విజయవాడకు చేరుకుంటాయని తెలిపారు. ఈ సందర్బంగా విజయవాడలో లక్షలాది ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికారమే పరమావధిగా కాసుకు కూర్చున్న ప్రధాన పార్టీలను కట్టడి చేసి సిపిఎంని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం నాయకులు పడాల గంగాధర్ రావు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని విమర్శంచారు. ప్రధానమంత్రి మోడీ తన కార్పొరేట్ స్నేహితులకు రూ.12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా రుణ మాఫీ చేశారని వివరించారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని, ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై పెద్దఎత్తున భారాలను మోపుతున్నారని దుయ్యబట్టారు. ఈ దుష్ట పాలనకు వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దింపాలని, మోడీ పాలనను బలపరుస్తున్న వైసిపి, టిడిపి, జనసేన దుష్ట చతుష్టయాన్ని ఓడించి రాష్ట్రంలో అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధి కోసం సిపిఎం, వామపక్ష పార్టీలను ఆదరించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సుందర బాబు మాట్లాడుతూ అంగన్వాడి, ఆశ, భవన నిర్మాణ కార్మికులు వంటి లక్షలాదిమంది కార్మికులకు వెన్నుపోటు పొడుస్తూ, కార్మిక చట్టాలు అమలు జరపకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విమర్శంచారు. కార్మిక జీవితాల్ని కష్టాల పాలు చేస్తూ, మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్న పాలక పార్టీలను రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు.