Jun 16,2023 17:50

గిరిజన సమస్యలను తెలుసుకుంటున్న జవహర్ నాయక్

అన్యాక్రాంతమవుతున్న చెంచు గిరిజనుల భూములు కాపాడాలి
గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జవహర్ నాయక్
ప్రజాశక్తి - ఆత్మకూర్

     శ్రీశైలం నియోజకవర్గంలోని పలు  చెంచు గిరిజన గూడెంలలో చెంచు గిరిజనులకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జవహర్ నాయక్ తెలిపారు.శుక్రవారం నాడు  చెంచు గిరిజనులతో మాట్లాడుతూ రుద్రకోడూరు చెంచుగూడెం, చదరంపెంట చెంచుగూడెం,కొట్టాల చెరువు,ఎర్రగుంట్ల చెంచుగూడెం,నాగలూటి చెంచు గూడెం కు చెందిన చెంచు గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని,చెంచు గిరిజనులకు ఐదువేలు,పది వేల రూపాయలు ఆశచూపి  కొన్ని సంవత్సరాల నుంచి వారి భూమిని గిరిజనేతరులు సాగుచేస్తూ అనుభవిస్తున్నారని,గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని సాగు చేసుకోలేక వారికి ఆర్థిక స్తోమత లేక,వారికి వ్యవసాయ పనిముట్లు,పొలం దున్నుకోవడానికి ఎద్దులు, ట్రాక్టర్లు లేక,తక్కువ డబ్బు లకే గుత్తాకు ఇవ్వడం జరిగిందని,చాలా మంది చెంచు గిరిజన రైతులకు రైతుభరోసా డబ్బులు రావటం లేదని, చెంచు గిరిజనుల సమస్యలు  అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఆర్ డి ఎఫ్ ఆర్ క్రింద గిరిజనులకు ఇచ్చిన భూములు వారికే చెందాలని,చెంచు గిరిజనుల భూములు కొనడం నేరమని, చెంచు గిరిజనుల పొలాల్లో బోర్లు వేసి,వ్యవసాయ పనిముట్లు వారికి అందించి, పొలం దున్నుకోవడానికి ఎద్దులు, ట్రాక్టర్లు,ఇవ్వాలని,చదరంపెంటఎర్రగుంట్ల,ముసలి మడుగు చెంచుగూడెంలకు చెందిన చెంచు గిరిజనుల భూములు అటవీశాఖ అధికారులు ఆక్రమించుకోవాలని చూడడం చాలా దుర్మార్గమని,రెండు సంవత్సరాల పాటు కరోనాతో చెంచు గిరిజనుల ఆరోగ్యం సరిగా లేక పంటలు వేయలేదని, అదే అదునుగా చూసుకుని చెంచు గిరిజనులను పొలాలకు పోకుండా అటవీశాఖ అధికారులు అడ్డగించడం చాలా అన్యాయమని, అటవీ హక్కుల చట్టం ప్రకారం సర్వ హక్కులు చెంచు గిరిజనులకే ఉన్నాయని, అన్నివిధాలుగా చెంచు గిరిజనులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.