Nov 15,2022 00:09

తహశీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నేత వెంకన్న

ప్రజాశక్తి- దేవరాపల్లి
మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రపేట గ్రామంలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని మండల తహశీల్దారు ఎం.లక్ష్మికి స్పందన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరభద్రపేట సమీపంలో సుమారుగా ఆరు ఎకరాలు అసైన్డ్‌ భూమిని కె.కోటపాడు మండలం గుల్లెపల్లి గ్రామానికి చెందిన గొర్లె వెంకటలక్ష్మి (ఈమె భర్త వెంకట అప్పారావు దేవరాపల్లి డిసిసిబి బ్యాంకు మేనేజర్‌) గిరిజనులు నుండి లీజుకు తీసుకొని పామాయిల్‌ తోటలు వేశారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ బోరు నిమిత్తం విద్యుత్‌ కనెక్షన్‌ కూడా తప్పుడు మార్గంలో పొందారని వెల్లడించారు. ఈ భూమిని స్వాధీనం చేసుకొని పేద గిరిజనులకు అప్పగించాలని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన లీజుదారుని భర్త వెంకట అప్పారావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
విద్యుత్‌ కనెక్షన్‌ తొలగింపు
సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తలకు విద్యుత్‌ అధికారులు స్పందించి లీజుదారు గొర్లె వెంకటలక్ష్మికి అగ్రిమెంటుపై ఇచ్చిన విద్యుత్‌ కనెక్షన్‌ విద్యుత్‌ శాఖ అధికారులు సోమవారం తొలగించినట్లు వెంకన్న తెలిపారు.