Apr 26,2023 22:44

సదస్సులో మాట్లాడుతున్న వైద్యులు బి.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రసవం విషయంలో వైద్యులందరూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శక సూత్రాలను పాటించాలని, అనవసర సిజేరియన్‌ ఆపరేషన్లను నిరోధించాలని కాటూరి వైద్య కళాశాల ప్రసూతి, స్త్రీల వ్యాధుల వైద్య విభాగాధిపతి డాక్టర్‌ బి.వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక జీఎంఏ హాల్లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) గుంటూరు శాఖ 'ప్రసూతి వైద్యం, వంధత్వం, స్త్రీలలో ప్రత్యుత్పత్తి అవయవాల వ్యాధులు, అబ్డామినల్‌ పెయిన్‌' తదితర అంశాలపై పత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఐఎంఎ గుంటూరు శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్‌ టి.సేవ కుమార్‌ అధ్యక్షత వహించగా డాక్టర్‌ బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గర్భం ధరించినప్పటి నుండి గర్భవతులకు, వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ప్రసవ సంబంధ శాస్త్రీయ సమాచారాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలని, కాంప్లికేషన్‌లను కూడా చెప్పాలని అన్నారు. ప్రగతి ఐవిఎఫ్‌ సెంటర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ కొల్లి అనిత మాట్లాడుతూ పిల్లల పుట్టకపోవడానికి లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు తొలుత మహిళకు, తర్వాత ఆమె భర్తకు తప్పనిసరిగా పరీక్షలు చేయాలని, తర్వాతే మందుల ద్వారా గర్భధారణ సాధ్యసాద్యాలను నిర్ధారించుకోవాలని చెప్పారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఆర్టిఫిషియల్‌ ఇన్సిమినేషన్‌, ఐయుఐ, ఐవిఎఫ్‌ వంటివి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ ప్రసూతి, స్త్రీల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ పి.జయంతి మాట్లాడుతూ స్త్రీలలో అండాశయ, గర్భాశయ సంబంధ వ్యాధులు నొప్పులకు కారణమవుతున్నాయన్నారు. మహిళలలో అబ్డామినల్‌ నొప్పి అనగానే తొలుత వారి వయసును బట్టి కారణాలను విశ్లేషించాలన్నారు. ఎక్టో పిక్‌ ప్రెగెన్సీ, పేల్విక్‌ ఇన్ఫ్లమెటరీ డిసీజెస్‌, ఒవే రియన్‌ సిస్ట్‌ టార్షన్‌, ఫైబ్రాయిడ్‌ తార్షన్‌ వంటివి అబ్డామినల్‌ పెయిన్‌కు కారణం అవుతాయని వివరించారు. నొప్పికి కారణాల గుర్తించి, అవసరమైన పూర్తి చికిత్స చేయవచ్చునన్నారు. ఐఎంఎ గుంటూరు శాఖ కార్యదర్శి డాక్టర్‌ వెలగా మహేష్‌ మాట్లాడుతూ స్త్రీల ప్రసూతి వ్యాధుల లక్షణాలు గుర్తించి నిర్ధారించడంలోనూ, స్త్రీల, ప్రసూతి వైద్య నిపుణులకు సకాలంలో రిఫర్‌ చేయడంలో వైద్యులందరూ కీలకపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో స్త్రీల వైద్య నిపుణులు, ఐఎంఎ గుంటూరు శాఖ సభ్యులు పాల్గొన్నారు.