* ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తి
* పెండింగ్‌లో 17 ఎకరాల భూసేకరణ
* బూర్జ మండలంలో కాలువ తవ్వకాలపై కోర్టు కేసులు
* డిసెంబర్ 31 నాటికి ముగియనున్న ఒప్పంద గడువు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: వంశధార, నాగావళి నదుల అనుసంధానం (హై లెవల్ కెనాల్) పనులను ఎన్నికల షెడ్యూల్ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 2017లో మొదలైన పనులు ఒప్పందం ప్రకారం 2020 నాటికల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు 80 శాతమే పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటికి పూర్తవుతుందని వంశధార ఇంజినీరింగ్ అధికారులు చెప్తున్నారు. మరో 20 శాతం మేర పనులను నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. భూసేకరణ, కొన్నిచోట్ల కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో నిర్ణీత తేదీలోగా పూర్తి కావడంపై సందేహాలు నెలకొన్నాయి. దీనికితోడు కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో గతంలో తీవ్ర జాప్యం కావడంతో ప్రస్తుతం పనులు చేపట్టడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. దీంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి.
వంశధార, నాగావళి నదుల అనుసంధానంలో భాగంగా హిరమండలం రిజర్వాయర్ గట్టుకు రెండు తూములు ఏర్పాటు చేసి అక్కడ నుంచి 33.58 కిలోమీటర్ల మేర నారాయణపురం వరకు కాలువ తవ్వాల్సి ఉంది. హిరమండలం వద్ద నీటిని సరఫరా చేసే చోట 43.7 మీటర్ల స్థాయిలో, నారాయణపురం ఆనకట్ట వద్ద కాలువ కలిసే చోట 29.09 మీటర్లు నిర్మించేలా డిజైన్ చేశారు. తద్వారా ఏటవాలుగా నీరు ప్రవహించి ఆనకట్టకు చేరుతుంది. నదుల అనుసంధానం పూర్తి చేస్తే ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లో ఉన్న ఐదు వేల ఎకరాలకు సాగునీరందుతుంది. దీంతోపాటు నారాయణపురం ఆనకట్ట ప్రధాన కాలువల కింద ఉన్న 37,053 ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
పెరిగిన ప్రాజెక్టు వ్యయం
వంశధార, నాగావళి నదుల పనులను రూ.84.90 కోట్ల వ్యయంతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 27, 2017లో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ప్రాజెక్టు పనులను నెల్లూరుకు చెందిన పి.వి రమణయ్య అండ్ కంపెనీకి రూ.57.99 కోట్లకు పనులను అప్పగించింది. అనుసంధాన పనులు 2020 నాటికే పూర్తి కావాల్సి ఉంది. పలుమార్లు ఒప్పంద కాలపరిమితిని పొడిగించిన ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేసేలా పొడిగించింది. అంచనా వ్యయాన్ని సవరించి రూ.145.34 కోట్లకు పెంచింది. ఇప్పటివరకు రూ.85.71 కోట్లను వెచ్చించారు.
పనుల జాప్యానికి కారణాలు ఇవేనా..?
హై లెవల్ కెనాల్ పనులకు సంబంధించి ఇంకా భూసేకరణ పెండింగ్‌లో ఉంది. కాలువ తవ్వకాల కోసం 17 ఎకరాల వరకు భూమిని సేకరించాల్సి ఉంది. అనుసంధాన పనులకు సంబంధించి సంబంధిత కాంట్రాక్టర్‌కు రూ.13 కోట్ల చెల్లింపు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. దీంతో పనుల కొనసాగింపునకు సంబంధిత కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. జలవనరులశాఖ అధికారులు చివరిగా పెనాల్టీ నోటీసు జారీ చేశారు. దీంతో పి.వి రమణయ్య అండ్ కో కంపెనీ దిగొచ్చి పనులను ప్రారంభించింది. పనులు చేస్తున్నా పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అదీగాక వర్షాలు పడుతుండడం కూడా పనులు ముందుకు సాగడానికి కొంత ఆటంకంగా మారింది.
కాలువ పనులకు అడ్డంకిగా కోర్టు కేసులు
బూర్జ మండలం చినలంకాంలో కాలువ నిర్మాణం కోసం దేవాదాయ, ధర్మాదాయశాఖకు చెందిన సుమారు 7.5 ఎకరాలు అవసరం పడింది. వంశధార అధికారులు పరిహారం కింద దేవాదాయ, ధర్మాదాయశాఖకు రూ.1.50 కోట్లు చెల్లించేశారు. భూముల్లో 13 మంది రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. చట్టం ప్రకారం పరిహారంలో 60 శాతం దేవాదాయ ధర్మాదాయశాఖకు, 40 శాతం కౌలు రైతులకు ఇవ్వాల్సి ఉంది. కౌలు రైతులకు పరిహారం చెల్లింపునకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ భూములు ఆలయానికి ఇచ్చిన ధర్మదాతకు పరిహారం ఇవ్వాల్సి వస్తే తనకు ఇవ్వాలని, లేకుంటే దేవాదాయశాఖకు చెందాలంటూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో బూర్జ మండలం చినలంకాం పరిధిలో 700 మీటర్ల మేర కాలువ తవ్వకాలకు బ్రేక్ పడింది. నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గంలో కాలువ నిర్మిస్తామని అధికారులు చెప్తున్నారు.










