Aug 14,2023 18:53

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు

వినతిపత్రం సమర్పిస్తున్న నాయకులు
అనుమతుల్లేని ప్రయివేటు
టౌన్‌ బస్సులు నియంత్రించాలని వినతి
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి:అనుమతుల్లేని ప్రయివేటు టౌన్‌ బస్సులను నియంత్రించాలని సిఐటియు మండల కమిటీ, జిల్లా ఆటో కార్మిక సంఘం, ఆటోస్టాండ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టివివి ప్రసాద్‌, కె.అజరు కుమార్‌ మాట్లాడుతూ ఇందుకూరుపేటకు రెండు బస్సులకు అనుమతి లేదని ఈ విషయంపై గతంలో అధికారులకి విన్నవించిన చర్యలు తీసుకోలేదన్నారు. యథేచ్ఛగా ప్రయివేటు టౌన్‌ బస్సులు ఇందుకూరుపేటకు తిరుగుతున్నాయని తెలిపారు. ఈ అనుమతి లేని టౌన్‌ బస్సుల వలన సుమారు 300 ఆటో కార్మికుల కుటుంబాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్న యాజమాన్యంపై కేసులు నమోదు చేసి, బస్సులను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అనుమతి లేని బస్సులపై చర్యలు తీసుకునే విధంగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ నెల్లూరు వారికి ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం జిల్లా ఆటో కార్మిక సంఘం, జిల్లా అధ్యక్షులు మారు బోయిన రాజా మాట్లాడుతూ తహశీల్దార్‌, ఎస్‌ఐలకు సమస్యను తెలియజేశామన్నారు. ఎస్‌ఐ ప్రైవేట్‌ టౌన్‌ బస్సు యాజమాన్యంతో హెచ్చరించినా సమస్య పరిష్కార కాలేదని తెలిపారు. మొండిగా వ్యవహరిస్తూ నిబంధన ఉల్లంఘిస్తున్న ప్రయివేట్‌ టౌన్‌ బస్సులపై అధికారులు కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కోశాధికారి వెంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు మురళి, ఇందుకూరుపేట ఆటో యూనియన్‌ పూర్వాధ్యక్షులు బాషా, అధ్యక్ష కార్యదర్శులు దయాసాగర్‌, వాసు, కమిటీ సభ్యులు నరసింహ, శ్రీనివాసులు, వెంకయ్య, పెంచలయ్య, సురేష్‌ పాల్గొన్నారు.