ప్రజాశక్తి - ముదినేపల్లి
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఊటుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో తవ్విన ఆక్వా చెరువులను వెంటనే ధ్వంసం చేయాలని ఆ గ్రామస్తులు సోమవారం సచివాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతిని అందచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొందరు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వాధికారుల అండదండలతో ఆక్వా చెరువులు తవ్వి పంట భూములను, తాగునీటి చెరువులను కలుషితం చేస్తున్నారన్నారు. దేవపూడికి చెందిన అధికార పార్టీకి చెందిన కొందరు ఊటుకూరులో అక్రమంగా చెరువులు తవ్వి ఆక్వా సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆక్వా సాగు చేసే చెరువులకు మురుగు బొదెల సౌకర్యం లేకపోవడంతో ఆయా చెరువుల్లోని నీటిని పంట కాల్వలోకి వదలడంతో ఆ నీరు తాగునీటి చెరువులోకి చేరి కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేసి తాగుతున్నట్లు తెలిపారు. కాలువల్లోని కలుషిత నీరు తాగిన పాడి పశువులు వివిధ రోగాలబారిన పడటంతో పాటు పాల దిగుబడులు తగ్గిపోతున్నాయన్నారు. పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయన్నారు. దేవపూడి, ఊటుకూరు గ్రామాల్లో చెరువుల తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇవ్వరాదన్నారు. అలాగే అనధికారికంగా తవ్విన ఐదు చెరువులను ధ్వంసం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవపూడికి చెందిన కౌలురైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉల్లంకి నాంచారయ్య, ఊటుకూరు గ్రామస్తులు కుర్యా రాజప్రకాష్, కె.గోపి, ముత్యాల రామచంద్రమూర్తి, పి.నాగరాజు పాల్గొన్నారు.










