Nov 06,2022 00:04

పెట్రోల్‌ బంక్‌ ఆవరణలో ఉన్న డీజిల్‌ ట్యాంకర్‌

ప్రజాశక్తి - యలమంచిలి, యలమంచిలి రూరల్‌
ఎటువంటి అనుమతుల్లేకుండా పెద్ద మొత్తంలో డీజిల్‌ తరలింపు వ్యవహారం ప్రజాశక్తి చొరవతో వెలుగు చూసింది. యలమంచిలి దగ్గర ఓ పెట్రోల్‌ బంకులో డీజిల్‌ ట్యాంకర్‌ రోజుల తరబడి ఉండటాన్ని గమనించిన ప్రజాశక్తి, అధికారులను వివరణ కోరడంతో 24వేల లీటర్ల డీజిల్‌తో ట్యాంకర్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకొని సీజ్‌ చేసినట్లు బయటపడింది. ఈ డీజిల్‌ ట్యాంకర్‌ అక్టోబర్‌ 22న పట్టుబడినా నేటికీ పోలీసులు కేసు వివరాలు వెల్లడించకుండా గోపత్య పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమంగా డీజిల్‌ వ్యాపారం సాగుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిఐ వివరణ
ఈ విషయంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విశాఖ రీజినల్‌ సిఐ లక్ష్మోజిని ప్రజాశక్తి శనివారం వివరణ కోరగా.., మండలంలోని పురుషోత్తపురం పరిసరాల్లోని మైహోం సిమెంట్‌ ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో అక్టోబర్‌ 22వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డీజిల్‌ ట్యాంకర్‌ను పట్టుకున్నట్లు లక్ష్మోజి తెలిపారు. 24 వేల లీటర్ల డీజిల్‌ లోడ్‌తో ఉన్న ఎపి 05టిడి 9599 నెంబరు గల ఈ ట్యాంకర్‌ను సీజ్‌ చేసి దగ్గరలోని పెట్రోల్‌ బంక్‌ దగ్గర పార్క్‌ చేసినట్టు వెల్లడించారు. ట్యాంకర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ను ప్రశ్నించగా వాహనం కాకినాడు ఆటోనగర్‌ నుంచి బయల్దేరిందని తెలిసిందన్నారు. అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి అదే రోజు రాత్రి 10.30 గంటలకు యలమంచిలి రూరల్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులు రవాణా చేయాలంటే ఫారం ఎఫ్‌ నిబంధనలు పాటించాలని, అవేవీ లేకుండా, లైసెన్స్‌, బిల్లులు కూడా లేకుండా పెట్రోలయం ఉత్పత్తులు తరలిస్తుండడంతో ట్యాంకర్‌ను సీజ్‌ చేసినట్లు చెప్పారు.
అనకాపల్లి ఎఎస్‌ఒ సిహెచ్‌.కల్యాణి వివరణ
ఇదే విషయమై అనకాపల్లి ఎఎస్‌ఒ సిహెచ్‌.కల్యాణిని వివరణ కోరగా... 22న ట్యాంకర్‌ సీజ్‌ చేసి పంచనామా నిర్వహించామని చెప్పారు. క్రిమినల్‌ చర్యల కోసం సిఫార్సు కూడా చేసినట్లు వెల్లడించారు. యలమంచిలి రూరల్‌ స్టేషన్‌కు నిందితులను అప్పగించామని, అనంతరం వివరాలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు అందజేశామని తెలిపారు. వారినుంచి వచ్చే అదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
యలమంచిలి రూరల్‌ పోలీసుల వివరణ
ఈ విషయంపై యలమంచిలి రూరల్‌ పోలీసులను వివరణ కోరగా... ట్యాంకర్‌ యజమాని రాజమండ్రికి చెందిన వెంకటరెడ్డిగా గుర్తించామని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన డ్రైవరు, క్లీనర్లపై కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.