ప్రజాశక్తి -కొల్లూరు : మండల పరిధిలోని రావికంపాడు చిన్న పులివర్రు డొంక వద్ద భట్టిపోలు మెయిన్ డ్రైనేజీ కాలువలో ఎలాంటి అనుమతులు లేకుండా జెసిపితో కొందరు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న టిడిపి కష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మైననేని మురళీకష్ణ, రైతులు అక్కడికి చేరుకొనే లోపు జెసిపి, ట్రాక్టర్లను తీసుకొని పరారీ అయ్యారు. మట్టి తవ్వకం గురించి ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ మురళీకష్ణ డ్రైనేజీ ఎఇకు సమాచారం అందించారు. ఎఇ ఘటనా స్థలాన్ని పరిశీలించి మట్టితవ్వకానికి తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. ఈ సందర్భంగా మురళీకష్ణ మాట్లాడుతూ అధికారంలో ఉన్నామని తాము ఏమి చేసినా చెల్లుతుందనే భ్రమలో వైసిపి నాయకులు ఉన్నారని తెలిపారు. మురుగు కాలువలను కూడా వదిలిపెట్టకుండా కక్కుర్తితో మట్టి మాఫియా చేస్తున్నారని ఆయన విమర్శించారు.










