Aug 26,2023 21:44

క్వారీని పరిశీలిస్తున్న పరిటాల శ్రీరామ్‌, తదితరులు

ప్రజాశక్తి - బత్తలపల్లి : గ్రామస్తుల అనుమతి లేకుండా కంకర క్వారీలు ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ హెచ్చరించారు. తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామంలో వైసిపి నాయకులు స్థానిక గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమ కంకర క్వారీతో పాటు కంకర క్రషింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేయడంపై శ్రీరామ్‌ తీవ్రంగా స్పందించారు. శనివారం స్థానిక రైతులతో కలిసి కంకర క్వారీలు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. క్రషర్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేస్తే ఎంత మేర ప్రభావం ఉంటుందన్నది శ్రీరామ్‌ ఆరా తీశారు. అలాగే 10 గ్రామాలకు ఆరాధ్య దైవంగా ఉన్న పురాతనమైనటువంటి అక్కమ్మగార్ల ఆలయాన్ని కూడా సందర్శించారు. గ్రామస్తులు ఇక్కడ కంకర క్వారీలు ఏర్పాటు చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని శ్రీరామ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ విషయం మీద జిల్లా కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేశామని వివరించారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ మాట్లాడుతూ పిన్నదరి గ్రామ పంచాయతీ సర్వే నెంబర్‌ 335 లో గ్రామ ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా, ప్రజల అభిప్రాయాన్ని సేకరించకుండా సుమారు 3 హెక్టార్ల విస్తీర్ణంలో అధికార పార్టీ నాయకులు క్వారీ, క్రషర్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ క్వారీ, క్రషర్‌ మిషన్‌ వేస్తే క్వారీలో బ్లాస్టింగ్‌ చేసినపుడు పంటపొలాల్లో పనిచేస్తున్న కూలీలు ప్రమాదానికి గురవడంతో పాటు , రైతుల పంట పొలాల్లోని డ్రిప్‌, స్ప్రింక్లర్లు, వ్యవసాయ మోటర్లు కూడా నాశనమవుతాయన్న ఆందోళన చెందారు. క్రషర్‌ స్టార్ట్‌ చేసినపుడు విపరీతంగా ధూళి, చిన్న ఇసుక రేణువులు పంట పొలాల మీద పడి పంట ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో దానిమ్మ, చీని, బొప్పాయి, వేరుశెనగతో పాటు కూరగాయలు పండిస్తున్నారని వీరికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. మరోవైపు ఇక్కడ సుమారు పది గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే అక్కమ్మ గార్ల గుడి ఈ కొండకు అనుకొని ఉందని.. ఈ ఆలయం కూడా క్వారీల కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు. ఇది గ్రామాల ప్రజల మనోభావాలు దెబ్బతీయటమేనని శ్రీరామ్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లానని, ఇప్పటికైనా దీనిపై జిల్లా కలెక్టర్‌, అధికారులు స్పందించి క్వారీలు క్రషర్‌ యూనిట్లకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేసిన కచ్చితంగా వాటిని అడ్డుకుంటామని శ్రీరామ్‌ హెచ్చరించారు..