Nov 11,2023 22:27

ప్రజాశక్తి - చాగల్లు అనుమానం పెనుభూతంగా మారడంతో ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. ఎనిమిది సంవత్సరాల పండింటి కాపురంలో ఇద్దరు బిడ్డలకు జన్మించిన ఆమె అనుమానం అనే రక్కసికి భర్త చేతిలో బలైపోయిన సంఘటన మండలంలోని ఉనగట్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం...ఉనిగట్ల గ్రామానికి చెందిన దొంగ వెంకటేశ్వరరావుకు అదే గ్రామానికి చెందిన సాయి హరితతో 8 ఏల్ల క్రితం వివాహం అయ్యింది. వారిద్దరి కాపురంలో ఇద్దరు మగ బిడ్డలు నాగ హర్ష(6), బాలాదీత్య(5)లు జన్మించారు. జెసిబి ఆపరేటర్‌గా పనిచేసే వెంకటేశ్వరరావు నాలుగు నెలల క్రితం కుటుంబ సమేతంగా తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లాలో పని కోసం వెళ్లారు. 4 రోజుల క్రితం భీమవరంలో బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు ఇద్దరు బిడ్డలతో కలిసి సాయి హరిత వచ్చింది. ఈ హాడావుడిలోనే భర్త వెంకటేశ్వరరావు ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆ ఫోన్‌కు ఆమె స్పందించేది కాదు. ఏమైనా భర్తతో గొడవ జరిగిందా? అనే అనుమానం కుటుంబ సభ్యులకు వచ్చింది. సాయి హరిత చినతల్లి పిల్లి సత్తెమ్మ ఆమెను ప్రశ్నించడతో తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడని, చీటికి మాటికి కొడుతున్నాడని సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆమె భర్త వెంకటేశ్వరరావు ఉనిగట్లకు చేరుకున్నాడు. తాను ఫోన్‌ చేసినా ఎందుకు స్పందించలేదని ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ ముదిరిన నేపథ్యంలోనే ఆమెను చెంపపై బలంగా కొట్టిన అనంతరం పీకను గట్టిగా నొక్కి హత్యకు పాల్పడ్డాడు. మృతురాలి చినతల్లి సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సిహెచ్‌వి రమేష్‌ మీడియాకు వెళ్లడించారు.