Aug 24,2023 00:44

ప్రశ్నలు అడుగుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-కోటవురట్ల, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం అణుకు గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి తెలిపారు. బుధవారం ఆయన అణుకు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందుతున్నదా ఫ్యామిలీ డాక్టర్‌ వస్తున్నారా అని ఆరా తీశారు. ఇబ్బందికరమైన గర్భవతులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. గ్రామస్తులు చెప్పినవిషయాలపై స్పందించిన కలెక్టర్‌ అంగన్వాడి భవనం మరమ్మతులు చేయిస్తామని, టెలిఫోన్‌ సిగల్‌ వచ్చేటట్లు చేస్తామని, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు బాగున్నాయని కితాబిచ్చారు. ప్రభుత్వ గృహాలు నిర్మించుకునే 10మంది లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి తరలించే సదుపాయం కల్పిస్తామన్నారు. రోడ్డు గురించి కలెక్టర్‌ను గిరిజనులు అడుగుగా ఆ ప్రాంతం అటవీ భూమి కావడంతో గ్రావెల్‌తో నడక మార్గం ఏర్పాటు చేస్తామన్నారు. రేషన్‌ వాహనం 5 కి.మీ దూరం వరకు వస్తుందని అక్కడి నుండి డోలీలలో సరుకు తీసుకొస్తున్నామని తెలియజేయగా ఇంటి వద్దకే రేషన్‌ వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. ఈ పర్యటనలో ఆర్డీవో జయరాం, తహసిల్దార్‌ జానకమ్మ, డిఎల్‌డిఓ ఉదయశ్రీ ఎంపీడీవో సువర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.