ప్రజాశక్తి -మక్కువ : ఏమండీ మీకు పెన్షన్ వస్తుందా.? వస్తుందండి.. ఏం లోపంతో మీకు పెన్షన్ ఇచ్చారు? కాలు బాగోలేదు... నాకు చెయ్యి బాగోలేదు అని గట్టిగా సమాధానం చెబుతూ తనిఖీకి వెళ్లిన అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యేలా.. వారి చెవులు రింగ్ మనీ లా ఒక్కొక్కరు చెబుతూ ఉంటే పింఛను ధ్రువపత్రం తనిఖీ చేసిన డిఆర్‌పిలు, ఇతర సిబ్బంది నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే వారికి సదరంలో ఇచ్చిన ధ్రువపత్రంలో వినికిడి లోపంగా ఉండడమే దీనికి కారణం. అలాగే కొంతమంది మహిళలకు భర్తలు ఉన్నప్పటికీ ఒంటరి మహిళలుగా ధ్రువపత్రాలు జారీ చేస్తూ పెన్షన్లు అందించిన తీరు కూడా ఈ తనిఖీల్లో వెలుగు చూశాయి. వివరాల్లోనికి వెళ్తే...
మండలంలోని 17వ సామాజిక తనిఖీని ఇటీవలే నిర్వహించారు. మంగళవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కె.రామచంద్రరావు అధ్యక్షతన ప్రజావేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులతో పాటు వైయస్సార్ పెన్షన్ కానుకలపై కూడా సామాజిక తనిఖీలు నిర్వహించిన అధికారులు గ్రామాల వారి వివరాలతో కూడిన నివేదికను వెలువరించారు. ఇందులో తూరుమామిడి, కొయ్యన్నపేట వెంకటబైరపురం గ్రామాల్లో నకిలీ వికలాంగు ధ్రువపత్రాలు పొంది పెన్షన్లు పొందుతున్న వారిని ఆడిట్లో గుర్తించినట్టు ప్రజాదర్బార్లో ఆయా డిఆర్‌పిలు నివేదిక సమర్పించారు. ఒక్క వెంకటబైరిపురంలోనే 53 నకిలీ వికలాంగ, ఒంటరి మహిళ పింఛన్లు పొందుతున్నట్టు గుర్తించారు. ఇటీవల పుట్టగొడుగుల్లా నకిలీ వికలాంగులు పుట్టుకొస్తున్నారని, దీనికి సంబంధించి ఓ పెద్ద రాకెట్ ఉందని మండలంలోని సిపిఎం ఇటీవల పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మండలంలో దాదాపు 8,192 మంది ప్రభుత్వ పింఛన్లు వివిధ రూపాల్లో పొందుతున్నారు ఇటీవల జరిగిన తనిఖీల్లో కూడా నకిలీ వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. అలాగే ఉపాధి హామీ పనుల్లో కూడా మస్తర్లపై సంతకాలు, వేలిముద్రలు లేకుండానే బిల్లును చెల్లించిన అంశాలు మండలంలోని దబ్బగెడ్డ, కవిరిపల్లి, కొయ్యన్నపేట, చెముడు పంచాయతీల్లో కూడా వెలుగు చూశాయి. స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లు సక్రమంగా పనిచేయడం లేదని ఈ సందర్భంగా జడ్పిటిసి సభ్యులు ఎం.శ్రీనివాసరావు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధిహామీలోకి ఇరిగేషన్ కాలువలు, ఇతర వ్యవసాయ ఆధారిత పనులను చేర్చాలని, తద్వారా రైతులకు మేలు చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎపిడి శ్రీహరి, ఎపిఒ రత్నకుమారి, ఎండిపిఒ సూర్యనారాయణ, ఎస్‌ఆర్‌పిలు, ఉపాధి హామీ సిబ్బంది, ప్రతినిధులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
కేంద్రం నిర్ణయం ఏమాత్రం బాగోలేదు
ఉపాధి హామీ చట్టానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించడం ఏమాత్రం బాగాలేదని జడ్పిటిసి సభ్యులు మామిడ శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ ఆడిట్ అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యుపిఎ ప్రభుత్వం నిరుపేదలకు బంగారు బాతు గుడ్డు లాంటి చట్టం తెచ్చిందని, కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత చేసే పనులు అనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ చట్టానికి అందించాల్సిన నిధులు కోత వేయడం సమంజసంగా లేదని ఈ సందర్భంగా అన్నారు. ఈ చట్టం వల్ల 17 ఏళ్లుగా గ్రామీణ ప్రాంత నిరుపేదల్లో ఎన్నో ఆశలు చిగురించాయని ఆర్థికంగా నిలబెట్టుకోగలిగారని ఈ సందర్భంగా గుర్తించేశారు.










