Dec 09,2022 23:47

వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నేతలు శ్రీనివాస్‌, వరలక్ష్మి

ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు నమోదులో అవకతవకలను సరిచేయాలని బుచ్చయ్యపేట తహశీల్దారు ఎస్‌వి.అంబేద్కర్‌కు సిఐటియు మండల కార్యదర్శి పి.సాంబశివరావు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదులో చాలా చోట్ల అక్రమాలు జరిగాయని, డిగ్రీ ఉత్తీర్ణత లేనివారు కూడా ఓట్ల నమోదు చేయించారని తెలిపారు. అక్రమంగా ఓట్లు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అనర్హుల పేర్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు.
కశింకోట : ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాలో పొరపాట్లను సరిచేయాలని సిపిఎం నాయకులు దాకారపు శ్రీనివాసరావు, డిడి.వరలక్ష్మి శుక్రవారం తహశీల్దారు కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలామంది పేర్లు రెండుసార్లు, మూడుసార్లు నమోదు అయి ఉన్నాయని, కొంతమంది ఇంటిపేర్లు మారిపోయాయని తెలిపారు. మూడేళ్ల డిప్లమా ఉన్నవారికి కూడా ఓట్లు ఉన్నాయని, కొందరివి విద్యార్హత వివరాలను పట్టికలో ఖాళీగా చూపించారని తెలిపారు. ఇటువంటి పొరపాటులను సరిదిద్ది సంబంధిత ఓటరుకు తెలియజేయాలని కోరారు.
కె.కోటపాడు : ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ముసాయిదా ఓటర్‌ జాబితాలో ఉన్న అర్హత లేని వారి పేర్లను వెంటనే తొలగించాలని సిపిఎం మండల కార్యదర్శి రొంగలి ముత్యాల నాయుడు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని పోలింగ్‌ బూత్‌ 171, 172 పరిధిలో అర్హత లేని వారు పేర్లు నమోదు చేసి ఉన్నాయని తెలిపారు. వారి వరుస సంఖ్య, గ్రామం, విద్యా అర్హత, వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హత లేని వారి పేర్లు వెంటనే తొలగించాలని కోరారు.