ప్రజాశక్తి-గొలుగొండ : మండలంలోని ఎఎల్‌పురంలో అనర్హులకు కేటాయించిన ఇళ్లస్థలాలపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాజీ జెడ్‌పిటిసి చిటికెల తారకవేణుగోపాల్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో 13 మంది అనర్హులకు ఇళ్లస్థలాలు కేటాయించారని అప్పట్లో తహశీల్దార్‌కు తెలియజేస్తే, కేవలం ఒక్కరిపైనే చర్యలు తీసుకుని, అతను కట్టిన పునాదిని తొలగించేశారని, మిగిలిన 12మందిపై ఎటువంటి చర్యల్లేకుండా విడిచిపెట్టేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు.
తమ తాత వెంకటరమణ సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఎస్‌సి, బిసి కాలనీలకు స్థలాన్ని ఇవ్వగా, అప్పట్లో మాదిగలకు ఇచ్చిన స్థలంలో కమ్యూనిటీ హాల్, బిసిలకు ఇచ్చిన స్థలంలో ప్రజా మరుగుదొడ్లు నిర్మించుకున్నారన్నారు. టీడీపీ హయాంలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటామని ఇచ్చిన స్థలంలో నేడు వైసిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులకు పట్టాలు ఇచ్చారన్నారు. దీనిపై కాలనీలోని ఎస్‌సి, బిసిలకు పోరాడుతూ, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదన్నారు. తానుకూడా ఆర్‌డిఒకు విన్నవించినా ఎటువంటి ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ప్రజావసరాల కోసం ఉపయోగపడే స్థలంలో అనర్హులకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.










