Aug 08,2023 21:22

అన్యాక్రాంతమైన భూములు హక్కుదారులకివ్వాలి
సచివాలయాల్లో అసైన్డ్‌ లబ్ధిదారుల పేర్లు ప్రకటించాలి
కోనేరు రంగారావు సిఫార్సులను అమలు చేయాలి
ఆర్‌డిఒ కార్యాలయం ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు
ముగిసిన వ్యకాస 'భూమి కోసం సమర శంఖారావం' పాదయాత్ర
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

అనర్హుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి హక్కుదారులకు లేదా వారి వారసులకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ భూములు పొందిన పేదలకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ రూపొందించిన 9/77 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయడం దుర్మార్గమని విమర్శించారు. మంగళవారం వ్యకాస ఆధ్వర్యాన స్థానిక సుందరయ్య కార్యాలయం నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్‌ భూముల ఆర్డినెన్స్‌ సవరణ వల్ల అసైన్డ్‌దారుల కంటే అక్రమంగా, దౌర్జన్యంగా అనుభవి స్తున్న భూస్వాములే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా అసైన్డ్‌ చట్ట సవరణ వల్ల పేదలకంటే అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అసైన్డ్‌ లబ్ధిదారుల లిస్టును గ్రామ సచివాలయంలో బహిరంగపరచాలని కోరారు. అందులో అర్హులకే యాజమాన్యపు హక్కును కల్పించాలన్నారు. అక్రమంగా అనుభవిస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17,21,160 కుటుంబాలకు చెందిన 27,41,609 ఎకరాల అసైన్డ్‌ భూముల వివరాలు ప్రతీ గ్రామ సచివాలయంలో బహిరంగపరచాలని కోరారు. ప్రభుత్వం భూ కొనుగోలు పథకంలో భూమి సేకరించి భూమి లేని పేదలకు పంచాలన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు సీలింగ్‌ భూములతో పాటు పేదలకు పంచడానికి అవకాశమున్న అన్ని రకాల భూములను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. భూ సమస్యల పరిష్కారంలో పోలీసుల జోక్యం ఉండకూడదన్నారు. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించే పేదలపైన అక్రమ కేసులు బనాయిస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ మాట్లాడుతూ భూ శంఖారావం పాదయాత్ర సందర్భంగా రెండు మండలాల్లో సుమారు 20 గ్రామాల్లో జరిగిన యాత్ర దృష్టికి పేదలు అనేక సమస్యలు తెచ్చారన్నారు. ఈ సందర్భంగా వచ్చిన 10 రకాల భూ సమస్యలను ఆర్‌డిఒ ఎఒకి వినతిరూపంలో అందించారు. ఈ సందర్భంగా జీవరత్నం, రామకృష్ణ మాట్లాడుతూ టి.నరసాపురం మండలం అల్లూరి సీతారామరాజు నగర్‌ ఇళ్లస్థలాల సమస్యలు పరిష్కరించాలన్నారు. రామమ్మగూడెం భూ సమస్య, బచ్చులేటిగూడెం అటవీ భూ సమస్యలు పరిష్కరించడంలో మండల రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. అనేకమార్లు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లు వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం, కేతవరం, చక్రదేవరపల్లి, గురవాయిగూడెం గ్రామాల్లో ఆక్రమణలో ఉన్న ల్యాండ్‌ సీలింగ్‌ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ భూముల కోసం పేదలు, దళితులు దశాబ్దాల తరబడి పోరాడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారుల్లో చలనం లేదన్నారు. రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో భూ రికార్డుల అవకతవకలు జరుగుతు న్నాయని మండిపడ్డారు. రెండు మండలాల తహ శీల్దార్‌లు రికార్డులు తారుమారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పేరుతో భూములను భూస్వాములకు కట్టబెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకాలువ మిగులు భూములు పేదల సాగుకు అవకాశం కల్పిస్తూ ఏక్‌సాల్‌ పట్టాలి వ్వాలని డిమాండ్‌ చేశారు. మిగులు భూముల్లో పశుపోషణకు, వ్యవసాయానికి పేదలను ఉపయోగించు కుంటుంటే వాటికి పట్టాలివ్వకపోగా పోలీసులతో నిర్బంధించి అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్‌ భూముల్లో పోలీసుల దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం పేదల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని దళిత, గిరిజన పేదలకు భూములు పంచాలని కోరారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కోనే రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేయా లని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్య కిరణ్‌, సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తామా ముత్యాలమ్మ, జిల్లా కమిటీ సభ్యులు మడకం సుధారాణి, ఎ.ప్రభాకర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాజమండ్రి దానియేలు, యాగంటి సీత, రామలక్ష్మి, దుర్గ, రుక్మిణి, కె.సుబ్బారావు, మస్తాన్‌ పాల్గొన్నారు.