ఇపుడిక్కడ
పరువు ప్రతిష్టలు ప్రాణప్రదమై
ఉన్మాదం స్వైర విహారం చేస్తోంది
అగ్రవర్ణ భావజాలమే సమస్తమై
దుర్మార్గం చావు దరువు వేస్తోంది
సామాజిక అంతరం మరిచి
మనస్సులు ఒకటి కావడమే
మహా పాపమై వెంటాడుతుంది
కులమత తారతమ్యం విడిచి
ఏడడుగులు కలిసి నడవడమే
యమపాశమై జీవం హరిస్తోంది
సరూర్ నగరం నడి బొడ్డున
జరిగిన హత్యే సజీవ సాక్ష్యం
ప్రేమ పెళ్లితో ఒకటైన జంటపై
చాందస రక్కసి కత్తి దూసింది
ఉడుకు నెత్తురు కళ్ల చూసింది
సొంత అన్నే దాడికి తెగబడితే
కాపాడమని ఎంత వేడుకున్నా
జనం చోద్యం చూస్తున్న దశ్యం
మానవత సిగ్గుతో తలదించింది
ఈ పాశవిక హత్యాకాండలు
నిత్య తంతుగా సాగుతున్నా
ప్రజలు ఉత్సవ విగ్రహ చందం
ప్రభుత్వం నిమ్మకు నీరెత్తని వైనం
ఈ వికత జాడ్యం వీగకుంటే
అమత, అస్రీన్ సుల్తానాల్లా
ఇంకెందరో బలి కాక తప్పదు
దుఃఖ నదులు పారక మానవు
అందుకే ఇప్పటికైనా
పౌర సమాజమా కళ్లు తెరువు
ప్రేమైక పక్షులకు అండగా నిలువు
సమైక్య భారతాన్ని ఆవిష్కరించు
(సరూర్‌నగర్లో ''కుల దురహంకార'' హత్యకు నిరసనగా)
కోడిగూటి తిరుపతి
95739 29493