Jul 25,2021 09:39

పండు వెన్నెల ముందు.. పిండి ముగ్గులు వేసినట్టు..
ఏమిటీ స్వప్నం? నాదో ప్రయత్నం.. నేనో వినూత్నం!!
'అను.. అను.. అనన్యా..!! ఏమిటే.. నీ ఊహా విహారం..?' చేతికి కాఫీ కప్పు అందిస్తూ.. గదిమిందా అన్నట్టు పిలిచిన శ్రావ్య వైపు తలతిప్పి చూశాను. భవ తలపుల తన్మయత్వపు ఉక్కిరి దిగమింగుతూ!
'అను.. నీకు సలహాలు చెప్పే రేంజ్‌లో ఉన్నానని నేనైతే అనుకోవడం లేదు. మన బ్యాచ్‌మేట్స్‌లో జీవితాన్ని నీకన్నా చదివినవాళ్లు లేరని కచ్ఛితంగా చెప్పగలను. చిన్నవయసులో అందునా పిల్లలు ఎదుగుతున్న టైంలోనే హజ్బెండ్‌ను కోల్పోయావ్‌. అయినా.. నువ్వేమైనా కుంగిపోయావా? బాధ్యతలు వదిలేశావా?' గోరువెచ్చని చిక్కటి కాఫీ కొండ మలుపులో కదులుతున్న గోదావరిలా నెమ్మదిగా గొంతులో దిగుతోంది. శ్రావ్య గంగా ప్రవాహంలా మాట్లాడుతూనే ఉంది.
శ్రావ్య నా తోడబుట్టింది కాదు, అయినా అంతకుమించి. ఇద్దరం డిగ్రీ వరకూ కలిసే చదువుకున్నాం. అన్ని విషయాలను షేర్‌ చేసుకుంటాం. నేను ఉండేది హైదరాబాదే అయినా, నా అనేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది విశాఖపట్నంలోనే. అది కూడా శ్రావ్యే!
కొన్నాళ్ల కిందటి వరకు నేను నేనుగానే బతికాను. సర్వం అనుకున్న నా హజ్బెండ్‌ మధు అకాల మరణం నా జీవితాన్ని కుంగదీసింది. అయినా పిల్లలను ఓ ఇంటివాళ్లను చేయాలన్న లక్ష్యం నా మనసుకు చెలియలి కట్టగా మారింది. 'మీరు చాలా అందంగా ఉంటారు. మళ్లీ పెళ్లి చేసుకోవచ్చుగా!?' అని ఎప్పుడూ ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు. అయినా అలాంటి ఆలోచన నా మనసులోకి ఎన్నడూ రాలేదు.
ఒకసారి నేను పనిచేసే ఆఫీసులోనే నా పైఅధికారి వచ్చి.. 'వీకెండ్‌కి చెన్నై వెళ్తున్నాను. వస్తారా మేడం?' అని అడిగేశాడు. ఓ రెండ్రోజులు నా వెంటపడ్డాడు. నాకింకా ఓ సంఘటన గుర్తుంది. 'బాపూ బొమ్మ గోడకు వేలాడుతుందని తెలుసు.. ఇలా నడిచి వస్తుందని తెలీదు బ్రదర్‌!' అంటూ.. నా అందచందాలను వర్ణిస్తూ.. పక్కవారితో చెప్పడం నేను మరిచిపోలేదు. అతనికి కావాల్సింది ఆడది. అదీ భర్తలేని ఆడదైతే ఇంకా మంచిది. ఇలాంటివారిని ఎంతమందిని చూశాను. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకున్నాను.
కానీ, ఈ మధ్య నాలో గంభీరమైన మార్పు. ఏ ఆలోచనైతే నా జీవితంలోకి అడుగుపెట్టదని అనుకున్నానో, ఆ భావనే పిల్లగాలిలా ప్రవేశించింది. నలభై నాలుగేళ్ల వయసులో నాలో వింత కోరికలు. అన్ని బాధ్యతలూ తీరిపోయాయి. ఇక, చేసినన్నాళ్లు పనిచేసుకుని, ఈ జీవితానికి ఎండ్‌ కార్డ్‌ వేసేద్దామనుకున్న సమయంలో భవ పరిచయం నన్ను నవ సమీరం దిశగా అడుగులు వేయించడం చిత్రంగా తోస్తోంది.

                                                                                ***

'అను.. నేనోటడుగుతా చెప్పు?' అన్న శ్రావ్య ప్రశ్నతో ఆలోచనల పరిష్వంగం నుంచి బయటపడ్డాను. 'జీవితంలో నువ్వు సుఖపడింది ఏమైనా ఉందా?' నా కళ్లలోకి చూస్తూ ప్రశ్నించింది. ఈ తరహా ఆలోచన ఇప్పటివరకూ నాకు రాలేదు. ఎందుకంటే.. నా కోసం నేను బ్రతికింది లేదు కనుక. శ్రావ్య నా సమాధానం కోసం ఎదురు చూడలేదు. 'అను.. ఏనాడైనా నీ గురించి ఆలోచించావా? పిల్లలే ప్రపంచం అంటావ్‌ కాదనను. కానీ, మనమూ మనుషులం కదే! మనల్ని మనల్నిగా ఇష్టపడేవారి ఒడిలో సేదదీరాలని, ఓదార్పు పొందాలని అనిపించదా? నీ కోసం తపిస్తున్న భవ నీ నుంచి ఏం ఆశిస్తున్నాడే ప్రేమ తప్ప! నువ్వు అప్డేట్‌ కాలేకపోతున్నావని అనిపిస్తోంది. ప్రపంచం మారుతోంది. గిరి గీసుకుని ఎవరైనా కూర్చున్నారా? మొండితనం కట్టిపెట్టు. భవ నిన్ను ఆరాధిస్తున్నాడు. అంతకుమించి ప్రాణంగా చూస్తున్నాడు.' కొడిగట్టిన మనోదీపంలో శ్రావ్య మాటలు చేతనామృతాన్ని చిలకరిస్తున్నట్టు తోచింది.
కాఫీ కప్పును పక్కన పెట్టి.. అప్రయత్నంగా ఫోన్‌ అందుకుని, వాట్సాప్‌ చెక్‌ చేశాను. 'గుడ్‌ మార్నింగ్‌ మేడం!' భవ మెసేజ్‌. తెలతెలవారుతూనే భవ నుంచి ఠంచనుగా వచ్చే సందేశం ఇది. ఒకసారి ఎప్పుడో కానీ, రోజంతా మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతూనే ఉన్నాడు. అయినా నేను రిప్లరు ఇవ్వలేదు. దీంతో ఏమనుకున్నాడో ఏమో.. ''గుప్పెడు గుండెకు స్పందనే కదా ప్రాణం అంటూ..!'' ఏడుపు మొహం ఎమోజీ పెట్టడం ఇప్పటికీ గుర్తు.
నిజమే, స్పందన లేని గుండె ఆగిపోతుంది. స్పందన శూన్యమైన జీవితం? బహుశా నా లాగే ఆర్టిఫీషియల్‌ కావొచ్చేమో! నిజానికి భవ పెట్టే మెసేజ్‌లను మొదట్లో లైట్‌ తీసుకునేదాన్ని. కానీ, తర్వాత తర్వాత ఆ అక్షరాల్లో ఆత్మీయత కనిపించింది. భవ గుండె చప్పుడు వినిపించడం మొదలైంది. వేళ్లు ముందుకు కదిలాయి. ''గుప్పెడు మాటలు రువ్వి.. గంపెడు నవ్వులు దూసుకుందామనుకున్నా!'' భవ పెట్టిన మెసేజ్‌. మనసులో ముద్ర వేసుకుంది. భవ నా కన్నా నాలుగేళ్లు చిన్నవాడు. వర్ధమాన రచయిత. ఎదుటి మనిషిలో అందచందాల కన్నా, ఆత్మీయతను, అభిమానాన్ని స్కాన్‌ చేయగల నేర్పరి.
మన దేశంలోకి కరోనా ప్రవేశించకముందు ఆఫీస్‌లో పనిలో నిమగమై ఉన్న నాకు మా డైరెక్టర్‌ గారి నుంచి పిలుపు వచ్చింది. ''అనన్య గారూ మీరు పుస్తక ప్రియులు కదా! మా అక్క కొడుకు భవకుమార్‌ అని, ఓ చిన్నపాటి రచయిత. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. వాడో చిన్న నవల రాశాడు. ''అనన్య'' అని! చిత్రంగా ఇది మీ పేరే! ఈ రోజు ఆవిష్కరణ ఉంది. మీరు తప్పకుండా రావాలి!' అన్నారు.

                                                                                 ***

'భవా! అనన్యగారని చాలా మంచివారు. పుస్తక ప్రియులు కూడా. నీకేదైనా సందేహం ఉంటే, అనన్యగారు నీకు గైడ్‌గా ఉపయోగపడతారు!' అని పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నన్ను పరిచయం చేస్తూ డైరెక్టర్‌గారు చెప్పుకొంటూ పోతున్నారు. భవ తొలిసారే అయినా నా కళ్లలోకి ఆత్మీయంగా చూశాడు.

                                                                               ***

తెల్లవారి వాట్సాప్‌ చెక్‌ చేసుకుంటున్న నాకు ''గుడ్‌ మార్నింగ్‌ మేడం!'' అంటూ విషెస్‌! ఏదో కొత్త నెంబర్‌ ఎందుకులే, అని పట్టించుకోలేదు. గబగబా పనికానిచ్చుకుని, ఆఫీస్‌కు వెళ్లిపోయాను. కొద్దిసేపటి తర్వాత అనూహ్యంగా భవ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నేరుగా నా సీటు దగ్గరకు వచ్చి, 'ఏంటి మేడం స్పందించరా?' అన్నాడు కొత్త ముఖం అన్న తారాట లేకుండానే. అలా మొదలైన పరిచయం అనూహ్య మలుపు తిరిగింది.
ఏం చేస్తున్నారంటే.. సమాజాన్ని చదువుతున్నానంటూ.. చిత్రంగా చెప్పేవాడు భవ. తను రచయిత కదా, ప్రతి మాటా అంతే. తరచి ఆలోచిస్తే తప్ప భావం బోధపడదు. నిజానికి భవతో నా పరిచయానికి ఏడాదిన్నర వయసే. భవకు పెళ్లయింది. కానీ, ఇష్టంలేని పెళ్లి చేశారని, రెండు నెలలకే ఆమె ప్రియుడితో వెళ్లిపోయిందని తనే చెప్పాడు. దీంతో లేడీసంటే భవకు ఒక వ్యతిరేక భావన స్థిరపడింది. అలాంటి భవలో నన్ను చూశాక ఏదో మార్పు చోటుచేసుకుందట! 'మనిషన్నాక మనసులో ఉన్నదే మాట్లాడాలి' అని అంటాడు. 'మనసు-మాట రెండూ ఒకటిగా ఉంటేనే మనిషి' అంటాడు. తనో కవి! ఇలాంటి ఆలోచనలు అతనికి సహజమే. కానీ, మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగే సమాజంలో ఉన్నామా? అనిపిస్తుంది.
మొదట్లో భవ గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే భర్తలేని స్త్రీ అంటే, ఈ సమాజానికి లోకువ. అవసరం తీర్చుకునేవారే తప్ప, జీవితాంతం తోడెవరుంటారు కనుక మాది చాలా పెద్ద కుటుంబం. పైగా నా చిన్నవయసులో ఉమ్మడిగానే ఉన్నాం. ఈ ప్రభావమే నాకు కుటుంబ బంధాలపై నమ్మకం కలిగించింది. కానీ, నా భర్త ఈ లోకాన్ని వీడిపోయాక, ఆస్తుల కోసం ఎవరు ఎన్ని ఘర్షణలకు దిగారో.. ఎవరెవరు నన్ను సూటిపోటి మాటలతో విమర్శించారో ఇప్పటికీ గుర్తే. అప్పటి నుంచి నేను, నా పిల్లలు.. ఇదే నా సామ్రాజ్యం. అలా గుంభనంగా ఉన్న నా మనసులో భవ ఇప్పుడు గూడుకట్టుకున్నాడు.

                                                                               ***

'మీకు అభ్యంతరం లేకపోతే మీతో కలిసి ప్రయాణించాలని అనుకుంటున్నాను.' ఓ సాయంత్రం వేళ భవ ఫోన్‌ చేసి, చెప్పిన మాట. ఇదో చిత్రమైన ఆలోచన. కాదు.. అంతకుమించి. అప్పటివరకు లేని ఏదో మధురోహ మనసును మెలిపెట్టింది. నిజమే తెలిసీతెలియని వయసులో పెళ్లి.. పిల్లలు.. సంసారం.. నేనేంటో తెలుసుకునేలోపే.. మధు దూరం కావడం. ఇప్పుడు అనూహ్యంగా భవతో పరిచయం. ఎటుపోతోంది మనసు?!
'నేను మీలా మౌనంగా ఉండలేను. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. అందుకే మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? ఏం తిన్నారు? ఇవన్నీ అడుగుతున్నాను. మీ పట్ల నాది ఆరాధనా భావం, ప్రేమ. ఇవి తప్ప, మరేమీ ఆశించడం లేదు. ఆశించను కూడా! మీ ఉద్దేశం ఏదైనా.. మీ ఆలోచన ఎలా ఉన్నా.. చెప్పండి!' నాలుగు రోజుల కిందట భవ పెట్టిన మెసేజ్‌ ఇది.
మరి ఇప్పుడు నేనేం చేయాలి? భవతో కొత్త జీవితానికి ఆహ్వానం పలకాలా? లేక సమాజానికి భయపడి, సర్దుకుపోవాలా? ఇవి సమాధానం లభించని ప్రశ్నలు. నా కాళ్లపై నేను బతుకుతున్నాననే సంతృప్తి ఉన్నా, తోడులేని మనిషిగా.. కష్టాలు పంచుకునే వ్యక్తిలేని జీవితాన్ని గడుపుతున్నాననే అసంతృప్తి పెల్లుబికుతోంది. ఆశ, నిరాశల నడుమ మనసు కొట్టుకులాడుతోంది. ''భవతో వెళ్లిపోతే..?!'' అనే ఆలోచన మనసును కుదిపేసింది. నా ఆలోచన తప్పో.. ఒప్పో.. తెలియని పరిస్థితి. ఓ సంఘర్షణకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? నా జీవితంలో ఎత్తుపల్లాలు తెలిసిన వ్యక్తి ఎవరున్నారు.. ఒక్క శ్రావ్య తప్ప!

                                                                                   ***

'అను.. అను..!' శ్రావ్య పిలుపుతో గతం నుంచి బయటపడ్డాను.
'తప్పు అనుకుంటే.. ఏదైనా తప్పే! అయినా.. ఈ ప్రపంచంలో ఎవరు తప్పులు చేయడం లేదు? నేనేమీ విప్లవం గురించి మాట్లాడడం లేదు. ఈ సమాజానికి సందేశాలు ఇవ్వడం లేదు. మనిషికి ఆకలి, దప్పిక ఎంత సహజమో, తోడు కూడా అంతే!. జీవితమనే తీగకు పందిరవుతానంటున్న నిజమైన మనిషితో కలిసి నడిస్తే తప్పేముంది?' శ్రావ్య మాటల అంతరార్థం నాకర్థమైంది. అదింకా ఏదో చెప్తూనే ఉంది. నా మనసు రెక్కలు తొడుక్కుంది. ఇప్పుడిక ఈ క్షణంలో వెళ్లిపోవాలి. భవతో కలిసి.. భవలో కలిసిపోవాలి! ఈ సమాజానికి భయపడాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాను. శ్రావ్యకు బై చెప్పి, బయల్దేరాను.

                                                                                     ***

శ్రావ్య చేసిన హితోపదేశం బాగున్నా.. భవతో నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ఆలోచన లీలగా తారాడుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? శ్రావ్య చెప్పినట్టు ఈ సమాజాన్ని ఎదిరించి, బతకగలనా? మళ్లీ మనసులో ఏదో కలకలం! ఎంత మారిందని అనుకున్నా, ఈ సమాజంలో మార్పు కొందరికే పరిమితం. నాబోటి మహిళ మారితే, జీవితాన్ని మార్చుకుంటే అదో చిత్రం.. విచిత్రం. భవపై నాకు వ్యతిరేకత ఏమీలేదు. అలాని తనకు నాపై ఉన్నంత ప్రేమ నాకు తనపై ఉందా? ఉంటే, సమాజం ఒప్పుకొంటే ఉందంటాను. కానీ ఒప్పుకోదు.. ఏం చేయాలి? జీవితం అందరికీ సాఫీగా సాగుతుందా? అలా అయితే ఇంత అంతర్మథనం ఎందుకు? మనసు వెళ్లిన చోటకు మనిషి.. మనిషి వెళ్లిన చోటకు కోరికల ప్రయాణం.. అసహజమే.

                                                                                 ***

'అమ్మా..!' మా చిన్నమ్మారు రేఖ మాట లీలగా వినిపిస్తుండగా నెమ్మదిగా కళ్లు తెరిచి, చూశాను. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న నా ఎదురుగా శ్రావ్య కనిపించింది. భవ ఆలోచనలతో నీరసించిన హృదయానికి రక్తపోటు తోడై, అపస్మారక స్థితికి చేరుకున్న నన్ను ఆస్పత్రికి తరలించారని అర్థమైంది. శ్రావ్య నాకు దగ్గరగా వచ్చి, ఏదో చెప్పబోయింది. వద్దనట్టు కళ్లు మూసుకున్నాను.
ఆకాశ తుషారంలో.. ఆశా బిందువులు
నిశీధి గుప్పిట్లో.. దివ్వెల చిమ్మెరలు
ఇసుక మేట్ల దాపుల.. రేణు సౌధాలు
గాజుకన్ను కాంతుల.. వెన్నెల ప్రయాణాలు!!
భవ కవిత్వం గుండెను పిండుతూ.. కను కొలుకుల నుంచి ధారగా మారి.. చెంపలను తడుపుతోంది.

                                                                          ***

రెండు రోజులు గడిచాయి. ఆఫీసుకు వెళ్లాలని అనిపించలేదు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశాను. మా ఇంటి ముందు ఏదో కారు ఆగినట్టు తోచి.. కర్టెన్‌ పక్కకు తప్పించి, చూశాను. కారులోంచి దిగుతున్న మా డైరెక్టర్‌ గారి దంపతులు కనిపించారు. ఒక్కక్షణం నన్ను నేను నమ్మలేక పోయాను. 'అనన్య గారూ.. భవ తన మనసులో మాట చెప్పాడు. మీ మనసులో ఏముందో మీ స్నేహితురాలు శ్రావ్య ద్వారా తెలుసుకున్నాను. జీవితం సాగిపోయే సెలయేరులా ఉండాలి. మనుషులు దూరమైనంత మాత్రాన మనసులు చంపుకుని బ్రతకాల్సిన అవసరం లేదనేది నా నిశ్చితాభిప్రాయం. సమాజం అంటారా? మనం మంచి చేసినా లోపాలు వెతుకుతూనే ఉంటుంది. సమాజంలో మనం ఒక భాగం కావాలే తప్ప, మనమే సమాజం కాకూడదు. మార్పు సహజం. జీర్ణించుకోవడం సమాజ లక్షణం. అయితే.. మీలాంటి వారి విషయంలో ఆలస్యం కావొచ్చు అంతే!' చాలా చొరవగా మా డైరెక్టర్‌గారు చెబుతున్న మాటల అంతరార్థం తెలిసింది.
ఏం చెప్పాలో తెలియలేదు. పెదవులు వణుకుతున్నాయి. తల వంచుకుని నిలబడ్డాను. డైరెక్టర్‌గారి భార్య నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తి.. నుదుటిన కుంకం దిద్దారు. 'భవ కారులో ఉన్నాడు. వెళ్లి మాట్లాడు. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి!' అంటూ నా చేయి పట్టుకుని నడిపించారు. మనసు తోటలో మందార సుగంధాలు పరిమళిస్తుండగా.. భవతో కలిసి నడిచేందుకు అడుగులు ముందుకు కదులుతున్నాయి.

ఆర్‌.డి. మల్లేశ్వరరావు
9705757047