Oct 17,2023 21:51

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు




ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడోరోజు మంగళవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
అన్నవరం దేవస్థానం తరఫున దుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ
అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తరఫున ఆలయ ఈవో, శరన్నవరాత్రుల చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఎస్‌.ఎస్‌.చంద్రశేఖర్‌ ఆజాద్‌లు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకత అమ్మవారికి మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పించి, అమ్మవారిని దర్శించుకున్నారు. అంతరాలయంలో దర్శనం అనంతరం అన్నవరం దేవస్థానం ప్రతినిధుల బందానికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నట్లు ఆజాద్‌ తెలిపారు. ఈ విశేష కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి కె.ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించా...
- రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆశీర్వచనం అందించారు. అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం మంత్రి రామచంద్రారెడ్డి మీడియా పాయింట్‌ దగ్గర మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్ల పాటు ప్రభుత్వ పరిపాలన విజయవంతంగా సాగించామన్నారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. సామాన్య భక్తులు త్వరితగతిన అమ్మవారి దర్శనం చేసుకునేలా యేర్పాట్లు చేశారని మంత్రి అన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా : మంత్రి కారుమూరి
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, అందరికీ ఆహారం సమద్ధిగా అందాలని, పాడిపంటలతో పురోభివద్ధి ప్రసాదించాలని జగన్మాతను వేడుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. దుర్గమ్మను దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతరాలయంలో దర్శనం అనంతరం ఆశీర్వచనం అందించారు. అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నిరాఘాటంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగేందుకు ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను వేడుకున్నానని మంత్రి కారుమూరి నాగేశ్వరావు తెలిపారు.
దుర్గగుడిలో లోపభూయిష్టంగా దసరా ఏర్పాట్లు
జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్‌ విమర్శలు
దుర్గమ్మగుడిలో దసరా ఏర్పాట్లు లోపభూయిష్టంగా వున్నాయని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ విమర్శించారు. మంగళవారం దుర్గగుడి మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లోని లోపాలను ప్రస్తావిస్తూ ఉంటే మాట్లాడకుండా మైక్‌ కట్‌ చేసి దేవాదాయ శాఖ అధికారులు, ఫెస్టివల్‌ ఆఫీసర్‌ ఆజాద్‌ అడ్డుపడటం సరికాదని అన్నారు. దీనికి పోలీస్‌ శాఖ వారు సహకరించారని, ఇలా చేయడం సామాన్య భక్తుల గొంతు నొక్కడమేనని విమర్శించారు. తాను అమ్మవారి కాపలాదారుడినని, అమ్మవారికి ఏ చిన్న లోపం జరిగినా ప్రశ్నిస్తానని అన్నారు. అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవ శోభ లేదని, అంతరాలయంలో పూల అలంకారానికి కూడా అమ్మవారు నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తాపడం పాలిష్‌ కూడా చేయించలేదన్నారు. ఈ మాత్రం దానికి పాలకమండలి, ఫెస్టివల్‌ ఆఫీసర్‌లు, దేవాదాయ శాఖ మంత్రి, ఈవో ఎందుకని మహేష్‌ ప్రశ్నించారు. వద్ధులకు, వికలాంగులకు లిఫ్ట్‌ సౌకర్యం ఎందుకు కల్పించడం లేదన్నారు. రాష్ట్ర ఉత్సవం అంటున్నారు కాబట్టి దసరా ఉత్సవాల ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని అన్నారు. అమ్మవారి ఆలయ అభివద్ధి కోసం రూ.70 కోట్ల నిధులు ప్రకటించిన సిఎం జగన్‌ అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చే ముందే అమ్మవారి ఆలయ ఖాతాకు ఆ నిధులు జమ చేయాలని డిమాడ్‌ చేశారు. మహేష్‌ వెంట ధార్మిక మండల సభ్యులు కరిమికొండ శివరామకష్ణ, శిరీష, రాళ్లపూడి గోవింద్‌, అడ్డగిరి పుల్లారావు, ఉమామహేశ్వరి, ఉదయ లక్ష్మి, విజయలక్ష్మి, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.
జగన్మాత దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరు భక్తి భావంతో మెలగాలని, ఆధ్యాత్మిక భావజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడం వారి గౌరవానికి మరింత శోభ చేకూరుస్తుందని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు అన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా మూడో రోజు మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు ఆలయానికి జనసేన నగర అధ్యక్షులు, పశ్చిమ ఇన్‌చార్జ్‌ పోతిన వెంకట మహేష్‌ మీడియా పాయింట్‌లో దేవాలయంలో ఏర్పాట్లు తదితర విషయాలపై మాట్లాడారు. మహేష్‌ వ్యాఖ్యలకు ఖండనగా చైర్మన్‌ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయ ప్రాంగణాన్ని పూల అలంకరణతో శోభ తీసుకురావడం జరిగిందన్నారు. కొండచర్యలు విరిగిపడే అవకాశం వున్నప్రాంతాలను నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ నిపుణులు పరిశీలించారని, వారి సూచనల మేరకు పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసి సత్వరమే అమ్మవారి దర్శనం చేసుకునేలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ ఏడాది చేసిన ఏర్పాట్లు భక్తులు ఎంతో సంతప్తి వ్యక్తం చేస్తుంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో అవాస్తవాలు మాట్లాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. దర్శనం కోసం వచ్చేవారు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఛైర్మన్‌ కర్యాటి రాంబాబు విజ్ఞప్తి చేశారు..
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దసరా మూడో రోజైన మంగళవారం శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. చత్తీస్‌ ఘడ్‌ మాజీ స్పీకర్‌ ధరమ్‌ లాల్‌ కౌశిక్‌, కేబిఎన్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ నారాయణరావు, తెలుగుదేశం పశ్చిమ నాయకులు ఎం ఎస్‌. బేగ్‌, దుర్గగుడి రెన్నోవేషన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పోతిన పైడిరావు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్న వేలాదిమంది భక్తులకు చక్కగా అమ్మవారి దర్శనం అయ్యేలా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతినిత్యం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళావేదికపై పలు సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంస్కతిక కార్యక్రమాలకు భక్తుల నుండి చక్కటి ఆదరణ లభిస్తుందని వారు వివరించారు. దసరా ఉత్సవాల కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సహాయ కార్యదర్శి పొట్నూరి దుర్గాప్రసాద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొరగంజి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు పోతిన బేసికంటేశ్వరుడు, మజ్జి ఈశ్వరరావు, మజ్జి శ్రీనివాసరావు, కామందుల నరసింహారావు, భోగవల్లి శ్రీధర్‌, పోతిన వెంకట ధర్మారావు, బంక హనుమంతరావు, బెవర సాయి సుధాకర్‌ పాల్గొన్నారు.
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో...
స్థానిక కొత్తపేటలోని శ్రీ సత్యభామ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం దేవాలయంలో నెలకొని ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు దసరా మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల సందర్భం గా దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ వంజరపు సూర్యారావు రాజ్యలక్ష్మి దంప తులు అమ్మవారిని దర్శించు కుని పూజలు చేశారు. ఈ సందర్భంగా సూర్యా రావు మాట్లాడుతూ దసరా సంద ర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దసరా రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మైలవరం : దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కోట వెనుక ఉన్న కోట మహాలక్ష్మి ఆలయంలో, స్థానిక కెడిసిసి బ్యాంకు వద్ద శ్రీ దుర్గా మోటార్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అమ్మవారు మంగళవారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ దుర్గా మోటార్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కష్ణ ప్రసాద్‌ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రుక్మిణి సమేత పాండురంగ ఆలయం వద్దఅమ్మవారిని కూరగాయలతో అలంకరించారు.