ప్రజాశక్తి-పుట్లూరు పార్టీలు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గురువారం యల్లనూరు మండలం దంతలపల్లి, కొత్తపల్లి, నేర్జాంపల్లి, లక్షుంపల్లి గ్రామాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతానికిపైగా అమలు చేశారన్నారు. అనంతరం మండల పరిధిలోని దంతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని పరిశీలించారు. జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్య భద్రత లభిస్తుందని, ప్రజల ఆరోగ్యం తమ బాధ్యతగా భావించిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, వైద్యాధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే పద్మావతి










