ప్రజాశక్తి - బెలగాం : గిరిజనుల అభివృద్ధి పట్ల రాష్ట్ర తెగలు (ఎస్టీ) కమిషన్ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుందని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డివిజి శంకర రావుకు అన్నారు. ఎస్‌టి రాష్ట్ర కమిషన్ జిల్లాలో మొట్ట మొదటి సారిగా బుధవారం పర్యటించింది. ఈ మేరకు స్థానిక ఐటిడిఎ గిరి మిత్ర సమావేశ మందిరంలో గిరిజన సంఘాల నుంచి సమస్యల పట్ల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటుందని, ఎప్పుడైనా గిరిజనులు తమ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. సమస్యల పరిష్కారానికి కమిషన్ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం దృష్టికి అవసరం మేరకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు.
పీసా చట్టం, 1/70 చట్టం, బినామీ గిరిజనులపై చర్యలు, షెడ్యూల్ ప్రాంతం చట్టాలు అమలులో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు కె. ధర్మా రావు, నీలకంఠం కోరారు. బోయ వాల్మీకిని ఎస్టీ జాబితాలో చేర్చరాదని వారు కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు జరగకుండా నివారించాలని, ఆహార పదార్థాలు మెనూ ప్రకారం విధిగా అందించాలని, అవసరం మేరకు వర్కర్ల నియామకం, సౌకర్యాలు కల్పించాలని గిరిజన సంఘం నాయకులు భగవాన్ కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఉన్న బాలికలు గర్భం దాల్చిన సంఘటనలు జరిగాయని, వాటి నివారణకు పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో ఇష్టానుసారం డేప్యూటేషన్ వేస్తున్నారని వాటి పట్ల దష్టి సారించాలని ఆయన అన్నారు. గిరిజన సంఘం నాయకులు మండంగి రమణ మాట్లాడుతూ జిఒ 3కు చట్టబద్దత కల్పించాలని, ఏనుగుల వల్ల కలుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టం దృష్ట్యా ఏనుగులను తరలించాలని, అటవీ హక్కల చట్టంలో గిరిజనులకు నష్టం చేసే సవరణలు అపాలని, అటవీ ఫలసాయాలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, జిసిసికి నిధులు పెంచాలని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ 5లో చేర్చాలని, పుర్ణపాడు - లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని, అన్ని గిరిజన గ్రామాలకు అనుసంధాన రహదార్లు నిర్మించాలని, వైద్య సదుపాయాలు పెంచాలని కోరారు.
ఉత్తరాంధ్ర గిరిజన సంఘం నాయకులు బి.రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఐటిడిఎ పిఒ నేతృత్వంలో గిరిజనులకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఐటిడిఎ పాలక మండలి సమావేశం నిర్దేశిత సమయంలో విధిగా నిర్వహించాలని, ఐటిడిఎ నిధులు గిరిజనుల అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని, పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని కోరారు. మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్లు లేవని, ఈరోజుకు ''డోలీ మోతలు''తప్పడం లేదని, గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి పరిశ్రమ లేదని, జిల్లాలో క్రీడా పాఠశాలలు లేవని, జిల్లా లో బిఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎమ్ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు, పీజీ సెంటర్, జిల్లా కో ''స్టడీ సర్కిల్'' ఏర్పాటు చేయాలని కోరారు. ఐటిడిఎ పరిధిలో ఉన్న వసతి గృహాల వార్డెన్లు, సిబ్బందికి గత విద్యా సంవత్సరం సుమారు 10 నెలలు నుంచి బిల్లులు చెల్లించలేదని, వసతి గృహాల విద్యార్థులు ఇబ్బందులకు, సిబ్బంది ఒత్తిడికి గురౌతున్నారని, కావున ప్రభుత్వం డైట్ బిల్లులు చెల్లించాలని, గిరిజన విద్యార్థి సంఘం కమిటీ తరుపున పి. సురేష్, కమిటీ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన ఎజ్జు బెల్లమ్మ కి సర్వేనెం 84/3 లో ఎం-36 సెంట్లు 'డి' పట్టా ఇవ్వడం జరిగిందని, సదరు 'డి' పట్టా భూమిలో సుమారు ఎం.12 సెంట్లు భూమిని శానపతి సన్యాసిరావు అనే భూస్వామి ఆక్రమించారని, దురాక్రమణ చేసిన సన్యాసిరావుపై చర్యలు తీసుకోవాలని వినతిని అందజేశారు. మక్కువ మండలం తెలగడవలసకు చెందిన విశ్వాణి స్వచ్చంద సంస్థ అందజేసిన ట్యాంకు ద్వారా తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. రామభ్రపురం మండలం జోగింద్ర వలసలో సామాజిక భవనాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్, ఎపిఒ ఎ.మురళీధర్, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి కె శ్రీనివాసరావు, జిసిసి డిఎం వి. మహేంద్ర కుమార్, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు ఘన స్వాగతం
ఎస్‌టి కమిషనర్ ఛైర్మన్ డాక్టర్ డి వి జి శంకర రావుకు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్‌పి విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవింద రావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్‌ఒ జె.వెంకట రావు, ఆర్‌డిఒ కె.హేమలత, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి కె శ్రీనివాసరావు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వివరించారు. అనంతరం పలువురు గిరిజన సంఘాల నాయకులు సన్మానించారు.










