
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
క్రీడలతో పాటు యువతను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా అనేక అవగాహన కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహిస్తున్నామని యువజన సర్వీసుల శాఖ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిఇఒ ఎమ్‌డిహెచ్.మెహర్రాజ్ తెలిపారు. యువతకు కెరీర్ అవకాశాలు కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.. క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడల్లో ప్రమాణాలు పెంపొందించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. రాష్ట్రస్థాయి యువజనోత్సవాలకు జిల్లా నుంచి ఎంతమంది పాల్గొంటున్నారు? తదితర ప్రశ్నలకు ప్రజాశక్తి ముఖాముఖిలో ఆయన సమాధానాలిచ్చారు.
ప్రశ్న : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది?
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వచ్చే డిసెంబర్ 11వ తేదీ నుంచి గ్రామ వార్డు పరిధిలోను, డిసెంబర్ 21వ తేదీన మండల నియోజకవర్గ స్థాయిలోనూ, 31వ తేదీన జిల్లాస్థాయిలోనూ పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లాస్థాయి పోటీల్లో విజేతలను ఎంపిక చేస్తాము.
ప్రశ్న : ఏయే క్రీడల్లో ఈ పోటీలుంటాయి? అందుకు అవసరమైన క్రీడా సామగ్రి ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చిందా?
క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖో ఖో, కబడ్డీ వంటి పోటీలుంటాయి. ఇప్పటికే క్రికెట్ వాలీబాల్ కిట్లు జిల్లాకు చేరుకున్నాయి.
ప్రశ్న : పులివెందులలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీకి సెలక్షన్స్ జరిగాయా? జిల్లా నుంచి ఎంతమంది ఎంపికయ్యారు?
స్పోర్ట్స్ అకాడమీకి ఈనెల నాలుగు, ఐదు తేదీల్లో జిల్లాస్థాయి ఎంపికలు జరిగాయి. 17 మందితో జాబితాను పంపాము. అక్కడ మళ్లీ ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ప్రశ్న : ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు పనులు ఎంతవరకు వచ్చాయి?
ఖేల్ ఇండియాలో భాగంగా సింథటిక్ ట్రాక్ పనులు ఇంకా మొదలు పెట్టలేదు. ట్రాక్ ఏర్పాటుకు రూ.తొమ్మిది కోట్లతో ప్రతిపాదనలు పంపాము. అందులో నాలుగు కోట్ల రూపాయలు ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ ఇస్తున్నారు. మిగిలిన సొమ్ము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మంజూరు కావాల్సి ఉంది.
ప్రశ్న : ప్రస్తుతం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో రెగ్యులర్ కోచ్‌లు ఎంతమంది ఉన్నారు? కోచ్‌ల నియామకం చేపట్టే అవకాశం ఏమైనా ఉందా?
ప్రస్తుతం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు ఫుట్ బాల్, వెయిట్ లిఫ్టింగ్‌కు మాత్రమే రెగ్యులర్ కోచ్‌లున్నారు. మిగిలిన క్రీడాంశాల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కోచ్‌లు పనిచేస్తున్నారు. కోచ్‌ల నియామకం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం.
ప్రశ్న : జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని ఎర్రకాలువ రిజర్వాయర్లో నిర్వహిస్తున్న వాటర్ గేమ్స్ కోచింగ్ ఎలా జరుగుతుంది? కోచ్‌లున్నారా? ఎంతమంది కోచింగ్ తీసుకుంటున్నారు?
ప్రస్తుతం 20 మంది వాటర్ గేమ్స్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన ఇద్దరు అక్కడ కోచింగ్ ఇస్తున్నారు.
ప్రశ్న: ఏలూరులోని ఇండోర్ స్టేడియం నిర్వహణ అధ్వానంగా ఉండటం వల్లనే, ఇలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో కూలిపోయిందనే అపోహలు ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఇండోర్ స్టేడియం అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
గతంలో ఇండోర్ స్టేడియం మరమ్మతులకు రూ.22 లక్షలు మంజూరైనప్పటికీ సకాలంలో పనులు జరగలేదు. అది కూలిపోయిన నేపథ్యంలో రూ.రెండు కోట్లతో కొత్త ఇండోర్ స్టేడియం నిర్మించడానికి ప్రతి పాదనలు పంపాము. ఎస్టిమేషన్ ఇవ్వాలని హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఇండోర్ స్టేడియం మైదానంలో స్కేటింగ్ రింక్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, హ్యాండ్ బాల్ కోర్ట్ కూడా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు పంపాము.
ప్రశ్న : యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి యువజన సర్వీసుల శాఖ ద్వారా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?
యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్‌లో అవగాహన కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా పదో తరగతి తర్వాత యువతకు ఉండే ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అంతేకాక ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, ప్రభుత్వ ఐటిఐతో కలిపి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. ఇటీవల జరిగిన జాబ్ మేళాలో జిల్లాలో 39 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము.
ప్రశ్న : యువతలో సామాజిక బాధ్యత పెంపొందించేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
వివిధ కోచింగ్ సెంటర్ల ద్వారా వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు యువతకు కోచింగ్ ఇస్తున్నాము. అలాగే రక్తదాన శిబిరాల నిర్వహణ, మొక్కలు నాటడం వంటివి నిర్వహించి యువతలో సామాజిక బాధ్యతను పెంచే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.