ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) విడుదలజేసిన నివేదిక ప్రకారం స్త్రీ, పురుష సమానత్వ సూచీలో (జెండర్ గ్యాప్‌లో) భారత్ రికార్డు మరింతగా దిగజారడం విచారకరం. మొత్తం 156 దేశాల్లో గతేడాదితో పోల్చితే 28 స్థానాలు దిగజారిన భారత్ 140వ స్థానంలో నిలిచింది. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్య పూర్తి చేయడం, ఆరోగ్య-మనుగడ, రాజకీయ సాధికారత రంగాలను పరిశీలించి గత 15 ఏళ్ల నుంచి ఈ నివేదిక రూపొందిస్తున్నారు. దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్ (65వ స్థానం), నేపాల్ (106), భూటాన్ (130), శ్రీలంక (116) మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే మనకన్నా వెనకబడి ఉన్నాయంటే మనం ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో విదితమవుతోంది. గడచిన రెండేళ్లలో స్త్రీ పురుషుల మధ్య అంతరం మూడు శాతం పెరిగింది. ఆ నివేదిక ప్రకారం భారత్‌లో జెండర్ గ్యాప్ 62.5 శాతంగా ఉంది. 'న స్త్రీ స్వాతంత్య్రమర్హతి' అన్న మనువాద సిద్ధాంతాన్ని విశ్వసించి, ఆచరించే ఆర్‌ఎస్‌ఎస్ చోదిత బిజెపి పాలనలో ఈ దారుణ పరిణామాన్ని ఎవరైనా ఊహించవచ్చు. అయితే ఈ నివేదికలో మాత్రమేగాక అంతర్జాతీయ సూచీలన్నిటా భారత్ స్థానం ఏడాదికేడాది దిగజారడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే విడుదలైన ఆకలి సూచిలో, మానవ హక్కుల విషయంలోనూ అదే పరిస్థితి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, మనువాద సిద్ధాంత అమలు మూలంగా మోడీ హయాంలో దేశం సకల విధాలా తిరోగమనంలో ఉంది.
ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల్లో కూడా స్త్రీ పురుష అంతరం చాలా ఎక్కువగా ఉండడం బాధాకరం. పురుషులు ఆర్జించే ఆదాయంలో ఐదో వంతు మాత్రమే మహిళలు పొందగలుగుతున్నారంటే వివక్ష, దోపిడీ ఎంత తీవ్రంగా ఉన్నాయో తేటతెల్లమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రపంచ సూచీలో భారత్ అట్టడుగు నుండి 10వ స్థానంలో ఉంది. మహిళా కార్మిక శక్తి శాతం కూడా 24.8 నుంచి 22.3కి తగ్గిందని, వృత్తి నిపుణులు, సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర 29.2 శాతానికి క్షీణించిందని నివేదిక తెలిపింది. అలాగే సీనియర్, మేనేజర్ పదవుల్లో మహిళల వాటా కేవలం 14.6 శాతంగానే ఉందంటే నిర్ణయాత్మక స్థానాల్లో వారి ప్రాతినిధ్యం స్వల్పమే. రాజకీయ సాధికారత విషయానికి వస్తే 2019లో 23.1గా ఉన్న మహిళా మంత్రుల శాతం, 2020లో 9.1 శాతానికి పడిపోయింది. మానవాభివృద్ధి సూచికల్లో ముఖ్యమైన విద్యా, వైద్య రంగాల్లో పరిస్థితీ అలాగే ఉంది. ఆరోగ్యం విషయంలో చిట్టచివరి నుంచి 5వ స్థానంలో భారత్ నిలిచిందని నివేదిక తెలిపింది. పురుషుల్లో నిరక్షరాస్యత 17.6 శాతం ఉండగా, మహిళల్లో ఇది 34.2 శాతం కన్నా ఎక్కువగా ఉంది. అయితే బాలికా విద్యలో పురోగతి ఉండడం, ఈ విషయంలో బాల బాలికల మధ్య అంతరం క్రమంగా తగ్గడం ఒకింత ఊరట కలిగిస్తుంది. మొత్తం నివేదికలో సానుకూలంగా అనిపించే అంశం ఇది మాత్రమే! అదే సమయంలో భారత్‌లో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు తమకు బాగా తెలిసిన వ్యక్తుల నుంచే హింస, వేధింపులకు గురవుతున్నారన్న విషయం సిగ్గుచేటు.
జనాభాలో సమానంగా ఉన్న స్త్రీ పురుషుల మధ్య అంతరం ఎక్కువగా ఉంటే ఏ దేశం లేదా రాష్ట్రం, ప్రాంతం పురోగమించడం సాధ్యపడదు. చదువులో, ఉపాధి కల్పనలో, వైద్య ఆరోగ్య సేవల విషయంలో ఇలా అన్నిటా మహిళలకు పెద్ద పీట వేస్తేనే ఇప్పుడున్న వెనుకబాటు తనాన్ని అధిగమించడానికి వీలవుతుంది. సామాజికార్థిక రాజకీయ నిర్ణయాల్లో వారి పాత్ర పెరగాలి. ఇంట్లో ఆడ, మగ పిల్లలను సమానంగా చూడడం మొదలు చట్ట సభల్లో కనీసం 33 శాతం రిజర్వేషన్ల వరకు అన్ని అంశాల్లో మహిళా సాధికారతను సాకారం చేయాలి. అయితే మనువాదుల పాలనలో ఇవి సాధ్యం కాదు సరికదా పరిస్థితి మరింత దిగజారుతుంది. స్త్రీ పరుష సమానత్వాన్ని సాధించడానికి సమాజంలో జెండర్ సెన్సిటైజేషన్ కోసం కృషి చేయడంతోపాటు పాలకుల విధానాల మార్పు కొరకు ఉద్యమాలు, పోరాటాలు సాగించాలి. అది కేవలం మహిళల పని మాత్రమే కాదు. పురుషులు ఉత్సాహంగా భాగస్వాములు కావాలి. బండిని లాగే రెండెడ్ల మాదిరిగా ఆడ, మగ పోటీ పడి ఉద్యమించాలి. అప్పుడే దేశం ముందడుగు వేస్తుంది. అన్ని అంతర్జాతీయ సూచీల్లోనూ భారత్ పైకెగబాకుతుంది.










