Aug 19,2023 21:54

ప్రారంభిస్తున్న కలెక్టర్‌

ప్రారంభిస్తున్న కలెక్టర్‌
అన్నీ దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది
ప్రజాశక్తి-నెల్లూరు:అన్నీ దానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ వారు దేశ వ్యాప్తంగా ఎన్నో ఆన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా జిజిహెచ్‌ లో రోగుల సహాయకులకు సుభోజనం ద్వారా ఆన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని ఎంపి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. జిజిహెచ్‌ లో వైద్యం కొరకు వచ్చే రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించాలన్న ఉద్దేశ్యంతో హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ వారు ఏర్పాటు చేసిన సుభోజనం ఫుడ్‌ స్టాల్‌ ను శనివారం ప్రారంభించారు
. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిజిహెచ్‌ కు వచ్చే రోగుల సహాయకులకు భోజన వసతి కల్పించుటకు హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ వారు సుభోజనం కార్యక్రమాన్ని ప్రారభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ వారు ఏపిలో సుమారు 20 లక్షల మందికి, తెలంగాణాలో సుమారు ఒక కోటి మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న పెద్ద ఆర్గనైజేషన్లలో హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఒకటని, ఈ ఫౌండేషన్‌ వారు త్యాగనిరతితో ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టడం దేశానికి కూడా గర్వకారణమన్నారు. ఈ ఫౌండేషన్‌ వారికి అన్నీ విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలను అభినందిస్తూ, దేశ గౌరవ ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్న హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్‌ యం. హరి నారాయణన్‌ మాట్లాడుతూ, చాలా మంది నిరుపేదలు అనారోగ్యం కారణంగా వైద్యం కొరకు జిజిహెచ్‌ కు వస్తుంటారని, రోగుల సహాయకులుగా వచ్చే వారికి ఆకలి తీర్చాలన్న ఉద్దేశ్యంతో హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ వారు సుభోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం రోగుల సహాయకులకు ఈ కార్యక్రమం ద్వారా భోజనం అందజేస్తారన్నారు. ఎవరైతే రోగుల సహాయకులుగా గుర్తించబడుతారో వారికి టోకెన్‌ ఇస్తూ భోజనంను అందచేస్తారన్నారు. ఈ మంచి కార్యక్రమానికి జిజిహెచ్‌ వారు తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ సంధర్భంగా కలెక్టర్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ కు సూచించారు. హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షులు వంశీధర దాస్‌ మాట్లాడుతూ, సుభోజనం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఆకలితో వున్న వారి క్షుద్బాదను తీర్చడమని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగుల సహాయకులకు భోజనం వారికి రోజు ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, అలాంటి వారికి సుభోజనం కార్యక్రమం ద్వారా రోజూ ఉచిత భోజనం అందించడం జరుగుచున్నదని తెలిపారు. దాతలు సహకరిస్తే ఇంకా ఇలాంటి కార్యక్రమాలను చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో హరే కష్ణ మూవ్మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ఉపాధ్యక్షులు విలాస్‌ విగ్రహ దాస్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. నరేంద్ర, విజయ డైరీ ఛైర్మన్‌ రంగారెడ్డి, వివిద డివిజన్ల కార్పొరేటర్లు, హరే కష్ణ మూవ్మెంట్‌ సభ్యులు పాల్గొన్నారు.