Aug 26,2023 23:28

ప్రజాశక్తి - బాపట్ల
ఆర్టీసీ బస్సు సర్వీసులన్నింటిలోనూ దివ్యాంగుల బస్సు పాసు రాయితీలను అమలు చేయాలని జనసేన దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు మూడు సంవత్సరాలకే ఆర్టీసీ పాస్  ఇస్తున్నామని చెప్పారని అన్నారు. ఆర్టీసీ పాస్ ఎక్ప్రెస్, ఆర్డినరీ బస్సులోనే రాయితీ అమలు చేస్తున్నారని తెలిపారు. సూపర్ ఫాస్ట్, లగ్జరీ బస్సులలో దివ్యాంగుల బస్సు పాసులు చెల్లుబాటు కావడం లేదని తెలిపారు. అన్ని రకాల బస్సు సర్వీసులలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు రాయితీ కల్పించాలని కోరారు. దివ్యాంగులు కేటాయించిన ఆర్టీసీ బస్సు సీట్లను పూర్తిస్థాయిలో వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ, కంది వెంకటరెడ్డి, గంటా నామలేశ్వరరావు పాల్గొన్నారు.